గోరఖ్‌పూర్ ఘటన నివేదికలో ఏముందంటే...
గోరఖ్‌పూర్ ఘటన నివేదికలో ఏముందంటే...
Published Thu, Aug 17 2017 8:32 AM | Last Updated on Sun, Sep 17 2017 5:38 PM
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 72 మంది చిన్నారులను బలితీసుకున్న గోరఖ్‌పూర్ బాబా రాఘవ దాస్ ఆస్పత్రి ఉదంతంపై విచారణ కమిటీ నివేదిక వచ్చింది. కేవలం ఆక్సిజన్ కొరత కారణంగానే 30 మంది చిన్నారులు చనిపోయారంటూ జిల్లా మెజిస్ట్రేట్ రూపొందించిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
సుమారు 30 మంది పిల్లలు ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగానే చనిపోయారన్న విమర్శలు రావటంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆగస్టు 12న ఖరగ్‌పూర్ జిల్లా మెజిస్ట్రేట్ రాజీవ్ రౌతెలా నేతృత్వంలోని కమిటీ ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజీ వైద్యులను, ఆస్పత్రి సిబ్బందితోపాటు రోగులను ప్రశ్నించిన అనంతరం కమిటీ నివేదిక రూపొందించింది.
"బీఆర్డీ ఆస్పత్రిలో ఆగస్టు 10 సాయంత్రం నుంచే ఆక్సిజన్ సరఫరా నిలిపివేశారు. అప్పటి నుంచి మరుసటి రోజు అంటే ఆగస్టు 11వ తేదీ వరకు ఆ 48 గంటల్లో 30 మంది పిల్లలు ఆక్సిజన్ అందక చనిపోయారు" అని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఘటనకు కాలేజీ ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రాదే పూర్తి బాధ్యతని స్పష్టం చేసింది. సిలిండర్ల కొరత విషయం తెలిసి కూడా ప్రభుత్వం దృష్టికి అంశాన్ని తీసుకెళ్లలేదని, కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తత చేయలేకపోయారని తెలిపింది. కనీసం ఆగష్టు 9న యోగి పర్యటన సందర్భంగా అయినా మిశ్రా అసలు విషయం తెలపకుండా సెలవుపై వెళ్లటం గురించి కూడా కమిటీ ప్రస్తావించింది. వీటితోపాటు బకాయిలు చెల్లించలేదన్న కారణంగా సిలిండర్లను సరఫరా నిలిపివేసిన పుష్పలీల సంస్థపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
మరోవైపు చికిత్స విషయంలో వైద్యులు కూడా నిర్లక్ష్యం వహించారని నివేదికను రూపొందించారు. వీరితోపాటు ఇన్‌చార్జిగా ఉన్న డాక్టర్ కఫిల్ ఖాన్, ఆస్పత్రి వ్యవహారాల కొనుగోలు కమిటీ సభ్యులు డాక్టర్ సతీష్ కుమార్, పారామెడికల్ సిబ్బంది, ఫైనాన్షియల్ క్లర్క్ తదితరులు కూడా బాధ్యులేనని పేర్కొంది. అయితే నివేదిక తమకు అందిన మాట వాస్తవమేనని చీఫ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ తెలిపినప్పటికీ అందులో ఉన్న అంశాలపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు.
Advertisement
Advertisement