గోరఖ్‌పూర్‌లో మళ్లీ ఘోరం..
► 48 గంటల్లో 42మంది మృత్యువాత
గోరఖ్‌పూర్ : ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి (బీఆర్డీ) లో చిన్నారుల మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. గడిచిన 48 గంటల్లో మరో 42మంది చిన్నారులు మరణించారు. వారిలో ఏడుగురు మెదడువాపు వ్యాధి, మిగిలినవారంతా రకరకాల వైద్య కారణాలతో చనిపోయారని ఆస్పత్రి ప్రిన్సిపల్ పీకే సింగ్ వెల్లడించారు. కాగా ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకూ 290మంది పిల్లలు మరణించారు.
అయితే ఈ ఏడాది జనవరి నుంచి 1,250మంది చిన్నారులు మృతి చెందారని, వారిలో 175మంది మెదడువాపు వ్యాధితో మరణించినట్లు ఆస్పత్రివర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఆర్డీ ఆస్పత్రి దుర్ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ విచారణకు ఆదేశిస్తూ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజీవ్ మిశ్రాను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మిశ్రాతో పాటు ఆయన భార్యను స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేసింది.
కాగా గోరఖ్‌పూర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు... తమ పిల్లల ఆరోగ్యం పూర్తిగా విషమించిన తర్వాత చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకు వస్తారని, దాని వల్ల తాము చిన్నారులకు తమ శాయశక్తులా చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని ఆస్పత్రి వైద్యుడు ఒకరు తెలిపారు. అయితే గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది చిన్నారుల మరణాలు తక్కువ అని అన్నారు. ఈ విషయాన్ని మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. గత నెలలో బీఆర్డీ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారిలో చాలా మంది నవజాత శిశువులు ఉన్న విషయం విదితమే.