లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోరఖ్‌పూర్ 63 మంది చిన్నారుల మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ పూర్ణిమా శుక్లా బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. గోరఖ్‌పూర్‌లో గత ఏడాది ఆగస్ట్‌లో బీఆర్‌డీ మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అలహాబాద్ హైకోర్టు తొమ్మిది మందిపై అభియోగాలు మోపింది. వారిలో డాక్టర్ కఫీల్ ఖాన్‌కు ఇటివల అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బీఆర్‌డీ మెడికల్ కాలేజీలో హోమియోపతి విభాగానికి చెందిన పూర్ణిమా శుక్లా మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ రాజీవ్ మిశ్రా భార్య. ముందస్తు విడుదల కోరుతూ పూర్ణిమా శుక్లా దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి యశ్వంత్ వర్మ విచారించారు. ప్రస్తుతం కేసు కీలక దశలో ఉందని, ఈ సమయంలో వారికి బెయిల్ మంజూరు చేస్తే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అందుకే పిటిషన్ తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment