ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత | Court Rejected Kavitha Bail Petition Over Delhi Liquor Case | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

Published Tue, Apr 9 2024 12:13 AM | Last Updated on Tue, Apr 9 2024 12:13 AM

Court Rejected Kavitha Bail Petition Over Delhi Liquor Case - Sakshi

సాక్ష్యాల నాశనం, సాక్షులను ప్రభావితం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి

ఆమె సమాజంలో పలుకుబడి గల వ్యక్తి.. బెయిల్‌ ఇస్తే మళ్లీ సాక్షులను ప్రభావితం చేయొచ్చు 

మైనర్‌ కుమారుడి పరీక్షలకు ఆమె నైతిక మద్దతు అక్కర్లేదు.. ఆమె బంధువులు చూస్తారు 

21 పేజీల తీర్పు వెలువరించిన ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి 

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌ జరిగిందన్న కేసులో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సాక్ష్యాలు నాశనం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోందని... ఆమెను బలిపశువుగా మార్చే యత్నం జరుగుతోందనేందుకు వీల్లేదని వ్యాఖ్యానించింది.

కవిత నిస్సందేహంగా పలుకుబడిగల మహిళ అయినందున బెయిల్‌ ఇస్తే మరోసారి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందిన పేర్కొంది. అందువల్ల ఆమెకు మధ్యంతర బెయిల్‌ నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. మైనర్‌ కుమారుడి వార్షిక పరీక్షల నేపథ్యంలో తల్లిగా తన పర్యవేక్షణ అవసరమైనందున మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. బెయిల్‌ నిరాకరణకు కారణాలను 21 పేజీల తీర్పులో పేర్కొన్నారు. 

చిన్న కుమారుడికి బంధువుల అండ ఉందిగా
‘‘పిటిషనర్‌ (కవిత) 16 ఏళ్ల మైనర్‌ కుమారుడికి ఇప్పటికే 50 శాతం పరీక్షలు పూర్తయ్యాయని న్యాయవాదులు తెలిపారు. కానీ కుమారుడి చదువు, మధ్యంతర బెయిల్‌ కోరిన రోజుల సంఖ్య, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మైనర్‌ కుమారుడు అన్నయ్య, తండ్రి, అత్తలను కలిగి ఉన్నాడు. వారంతా అతనికి తగిన మద్దతు ఇవ్వలేరనడానికి ఎలాంటి కారణం కనిపించట్లేదు. చిన్న కుమారుడి పరీక్షల వేళ తల్లి నైతిక మద్దతు ఎంతో అవసరమని న్యాయవాదులు చెబుతున్నారు. కానీ 19 ఏళ్ల వయసున్న కవిత పెద్ద కుమారుడు స్పెయిన్‌లో చదువుతున్నాడు.

భౌతికంగా తల్లిదండ్రులు దగ్గర లేకున్నా విదేశాల్లో అతను చదువుకోగలుతున్నప్పుడు బంధువుల సమక్షంలో ఉంటున్న చిన్న కుమారుడు పరీక్షలు రాయలేడనడం సమంజసంగా కనిపించట్లేదు. పిల్లల పరీక్షల ఆందోళన పరిష్కరించడానికి తల్లి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనడం మధ్యంతర బెయిల్‌ మంజూరుకు తగిన కారణంగా కనిపించట్లేదు. కవిత కేసు పరిష్కారం విషయంలో మైనర్‌ తండ్రి బిజీగా ఉన్నారన్న కారణం సైతం ఆమోదయోగ్యం లేదు. అందుకే మైనర్‌ కుమారుడికి అతని అత్తలు తగిన మద్దతు ఇవ్వాల్సిందిగా కోర్టు సూచిస్తోంది.  

కేసులో ప్రాథమికంగా ప్రమేయం కనిపిస్తోంది
‘‘మాజీ ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, ఉన్నత విద్యావంతురాలిగా కవిత సమాజంలో పలుకుబడి గలవారని నిస్సందేహంగా చెప్పొచ్చు. అంతేకానీ ఈ కేసులో ఓ నిస్సహాయ మహిళను బలిపశువును చేస్తున్నారని ఏ ప్రమాణాల ప్రకారమూ చెప్పేందుకు వీలు కనిపించట్లేదు. నేరాల విషయంలో కవిత చురుకైన ప్రమేయం, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నంతోపాటు ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలు ధ్వంసం చేస్తారనే విషయంలో కోర్టు ముందుంచిన అంశాలను పరిశీలిస్తే కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోంది. అందువల్ల మహిళ కాబట్టి పీఎంఎల్‌ఏ చట్టం సెక్షన్‌ 45 (1) ప్రకారం విచక్షణకు ఆమె అర్హురాలు కాదు. ఈ పరిశీలనలతో బెయిల్‌ దరఖాస్తు తిరస్కరిస్తున్నా’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. 

నేడు న్యాయమూర్తి ముందుకు కవిత 
జ్యుడీషియల్‌ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ కవితను తీహార్‌ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరచనున్నారు. అంతకుముందు మధ్యంతర బెయిల్‌ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం కవిత వేసిన పిటిషన్‌ను త్వరగా విచారించాలని ఆమె తరఫు న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్‌ బెయిల్‌పై ఈ నెల 20న విచారిస్తానన్న న్యాయమూర్తి... తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతానని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement