పాలస్తీనా-ఇజ్రాయెల్ అంశంపై చర్చకు విపక్షం పట్టు; అంగీకరించని ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, పాలస్తీనా సంక్షోభంపై చర్చించాలంటూ ప్రతిపక్షం పట్టుబట్టడంతో బుధవారం రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దాదాపు ప్రతిపక్షమంతా ఈ విషయంపై చర్చకు పట్టుబట్టగా.. ఆ రెండు దేశాలతో భారత్‌కు స్నేహపూర్వక సంబంధాలున్నాయని, చర్చను చేపట్టడం వల్ల ఆ దేశాలతో దౌత్య సంబంధాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ చర్చకు ప్రభుత్వం తిరస్కరించింది. విపక్ష సభ్యులు పట్టు విడవకపోవడంతో సభను రెండుసార్లు వాయిదావేశారు. జీరో అవర్ ప్రారంభం కాగానే.. జీరో అవర్ జాబితాలో ‘పాలస్తీనాలోని గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో జరుగుతున్న హింసపై చర్చ’ అంశం ఉందంటూ.. ఈ విషయంపై మాట్లాడాల్సిందిగా జేడీయూ సభ్యుడు అలీ అన్వర్ అన్సారీని సభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ కోరారు. అయితే, ఈ విషయంపై చర్చకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అంగీకరించలేదు. ‘ఈ రోజు సభాకార్యక్రమాల జాబితాలో ఈ విషయం ఉందన్న విషయం ఉదయమే తెలిసింది.
నాతో సంప్రదించకుండానే దీన్ని జాబితాలో చేర్చారు. అందుకే చైర్మన్‌పై ఉన్న గౌరవంతో ఈ విషయం చెప్పేందుకు సభకు వచ్చాను’ అని వెల్లడించారు. మరోపక్క.. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై లోక్‌సభలో విపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.ఆకాశాన్నంటిన ధరల విషయంలో తగిన చర్యలు తీసుకోలేదని, భారీ మెజారిటీతో నెగ్గినప్పటికీ పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నాయి. తమ హయాంలో పాదుకొల్పిన ఆర్థిక పునాదులను మరింత పటిష్టం చేయడంలో మోడీ సర్కారు విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. బడ్జెట్‌లో సాహసోపేత నిర్ణయాలు ఉంటాయని ఆశించి నిరాశచెందామని పేర్కొంది.
‘ఇజ్రాయెల్’పై రాజ్యసభలో రగడ
Published Thu, Jul 17 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM
Advertisement