న్యూఢిల్లీ: ప్రణాళికేతర వ్యయాన్ని పది శాతం తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పొదుపు మంత్రం పఠిస్తోంది. అందులో భాగంగా.. అన్ని మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ విభాగాలు కొత్త ఉద్యోగాలు సృష్టించరాదని, ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సైతం భర్తీచేయరాదని ఆదేశాలు జారీచేసింది. కొత్త ఉద్యోగాలపై సంపూర్ణ నిషేధం ఉంటుందని ఆర్థికశాఖ బుధవారం జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. అలాగే ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను.. చాలా అరుదైన, అనివార్యమైన పరిస్థితుల్లో తప్పితే భర్తీ చేయటం జరగదని పేర్కొంది. ఖరీదైన ఎగ్జిక్యూటివ్ తరగతిలో అధికారుల విమాన ప్రయాణాలపై బుధవారం నుంచి నిషేధం విధించింది. అయితే విదేశీ ప్రయాణాలకు ఈ ఆంక్షలు వర్తించవని మినహాయింపునిచ్చింది. కానీ.. అత్యంత అవసరమైన, అనివార్యమైన అధికారిక కార్యక్రమాలకు మాత్రమే విదేశీ ప్రయాణాలను పరిమితం చేయాలని ప్రతి శాఖ, విభాగం కార్యదర్శికి నిర్దేశించింది. అలాగే.. విదేశీ ప్రయాణాలకు వెళ్లే ప్రతినిధుల బృందం సభ్యుల సంఖ్యను అత్యంత కనిష్టానికి తగ్గించాలని స్పష్టం చేసింది.
అత్యంత అవసరమైన సదస్సులు, సమావేశాలను మాత్రమే నిర్వహించాలని చెప్పింది. విదేశాల్లో ప్రదర్శనలు, సదస్సులు, సమావేశాలను నిర్వహించటాన్ని.. వాణిజ్య ప్రోత్సాహ ప్రదర్శనలకు మినహా అనుమతించబోమని తెలిపింది. అలాగే ఫైవ్ స్టార్ హోటళ్లలో సదస్సులు, సమావేశాలను నిషేధిస్తున్నట్లు స్పష్టంచేసింది. తొలగించిన వాహనాల స్థానంలో కొత్త వాటిని తీసుకురావటం మినహా.. కొత్త వాహనాల కొనుగోళ్లనూ నిషేధిస్తున్నట్లు చెప్పింది. ఈ పొదుపు చర్యలు ఎయిమ్స్, ఆల్ ఇండియా రేడియో వంటి స్వయం ప్రతిపత్తిగల సంస్థలకు కూడా వర్తిస్తాయని ఆర్థికశాఖ స్పష్టంచేసింది. ఆయా శాఖలకు, సంస్థలకు బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు మించి కొత్తగా ఎలాంటి హామీలూ ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. ఈ పొదుపు చర్యలను తప్పనిసరిగా పాటించేలా చూడాల్సిన బాధ్యత ఆయా శాఖల కార్యదర్శులదేనని, సంబంధిత శాఖల ఆర్థిక సలహాదారులు పొదపు చర్యలపై ప్రభుత్వానికి త్రైమాసిక నివేదికలు అందించాలని నిర్దేశించింది.
ద్రవ్యలోటును 4.8శాతానికి పరిమితం చేయటం లక్ష్యం
2013-14 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి)లో 4.8 శాతానికే పరిమితం చేయాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పొదుపు చర్యలు చేపడుతోంది. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచీ ప్రభుత్వం ఇలాంటి చర్యలు ప్రవేశపెడుతోంది. గత ఏడాది నవంబర్‌లో కూడా ఇలాంటి పలు చర్యలు అమలు చేసింది. ప్రభుత్వ పనితీరు సామర్థ్యంపై ప్రభావం చూపకుండానే ద్రవ్య క్రమశిక్షణను ప్రోత్సహించటానికి ఇలాంటి చర్యల ఉద్దేశమని, ప్రస్తుత ద్రవ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వ్యయాన్ని హేతుబద్ధీకరించటం, అందుబాటులో ఉన్న వనరులను పొదుపుచేయటం అవసరమని ఆర్థికశాఖ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును జీడీపీలో 5.1 శాతంగా నిర్దేశించుకోగా ప్రభుత్వం చేపట్టిన పొదుపు చర్యల ఫలితంగా దానిని 4.9 శాతానికి మాత్రమే పరిమితం చేయగలిగారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 4.8 శాతం మించకుండా చూడాలని తాను లక్ష్మణరేఖ గీసినట్లు ఆర్థికమంత్రి పి.చిదంబరం ఇటీవల పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.16.65 లక్షల కోట్లు బడ్జెట్ అంచనా వ్యయంగా, అందులో రూ.11.09 లక్షల కోట్లు ప్రణాళికేతర వ్యయంగా చూపారు.
ఉద్యోగాలను భర్తీ చేయొద్దు..
Published Thu, Sep 19 2013 12:20 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement