జల్లికట్టుకు మళ్లీ పచ్చజెండా!
న్యూఢిల్లీ: ప్రమాదకరమైన క్రీడగా పేరొందిన జల్లికట్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. వచ్చే ఏడాది నుంచి తమిళనాడులో జల్లికట్టు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వనున్నట్టు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సూత్రప్రాయంగా వెల్లడించారు. పొంగల్ (సంక్రాంతి) పండుగ సందర్భంగా తమిళనాడులో అనాది సంప్రదాయంగా జల్లికట్టు క్రీడను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఎద్దు ఆవేశంగా పరిగెడుతుండగా.. వెంట పరిగెత్తే వ్యక్తులు దానిని అదుపులోకి తెచ్చి నిలువరిస్తారు. ఈ క్రీడాలో అనేకమందికి గాయాలవుతున్నాయని, ఈ ఆటవిక ఆట వల్ల మూగజీవాలు కూడా హింసను ఎదుర్కొంటున్నాయని, జంతు పరిరక్షణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో గత ఏడాది సుప్రీంకోర్టు జల్లికట్టును నిషేధించింది.
ఈ విషయమై కేంద్ర పర్యావరణ మంత్రి జవదేకర్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ' తమిళనాడులో జల్లికట్టు, మహారాష్ట్ర ఎడ్లబండ్ల క్రీడలు, కర్ణాటకలో కంబాలా, పంజాబ్‌లో ఎద్దుల రేసు వంటివి సంప్రదాయ క్రీడలు. శతాబ్దాలుగా ఇవి కొనసాగుతున్నాయి. ఈ సంప్రదాయిక క్రీడలు కొనసాగాలని మేం కోరుకుంటున్నాం. అదేసమయంలో జంతువులు కూరమైన హింసకు లోనకాకుండా చూడాలని భావిస్తున్నాం. ఈ విషయంలో త్వరలోనే శుభవార్త అందిస్తాం' అని చెప్పారు. అయితే జల్లికట్టు వంటి జంతువులను హింసించే ప్రమాదకర క్రీడలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వవద్దంటూ జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.