సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఈ దిశగా కఠినమైన చర్యలకోసం రంగం సిద్ధం చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలుతోపాటు భారీగా జరిమానా విధించేలా.. ముస్లిం మహిళల (రక్షణ, విడాకులపై హక్కులు) చట్టం 1986కు పలు మార్పులు చేస్తోంది.
న్యాయశాఖ, హోంశాఖ వర్గాలు సంయుక్తంగా రూపొందించిన ముసాయిదాలో ట్రిపుల్ తలాక్ చెప్పటాన్ని తీవ్రంగా పరిగణించటంతోపాటు ఆ నేరానికి పాల్పడినవారికి మూడేళ్ల జైలు, జరిమానా లేదా రెండింటినీ అమలుచేసేలా నిబంధనలున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు మంత్రుల బృందంతో చర్చించి, రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది ముసాయిదాను సిద్ధం చేస్తారని సమాచారం. ముస్లిం మహిళల హక్కుల చట్టాన్నే.. ‘షా బానో చట్టం–1986’గా కూడా పిలుస్తారు.
ముస్లిం మతపెద్దలనుంచి తీవ్ర విమర్శలు ఎదురైనప్పటికీ రాజీవ్ గాంధీ ప్రభుత్వం షా బానో కేసు నేపథ్యంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ చట్టం పీఠికలో విడాకులు పొందిన తర్వాతే మహిళలకు వర్తించేలా నిబంధనలున్నాయని.. వీటిని మార్చి విడాకులకు ముందే న్యాయం జరిగేలా మార్పులు చేయాలని భావిస్తోంది. దీంతోపాటుగా నేరశిక్షాస్మృతిలోని సెక్షన్ 125 (భార్య, పిల్లలు, తల్లిదండ్రుల పోషణకు నిరాకరించినప్పుడు తీసుకునే చర్యలు)కూ సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది.
సుప్రీంకోర్టు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నా దీనిపై ముందుకే వెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలకు ముసాయిదాలను పంపించిన న్యాయశాఖ.. దీనిపై వారి అభిప్రాయాలను కోరనుంది. ట్రిపుల్ తలాక్ మార్పులపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందంలో రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరీలున్నారు.
విడాకుల తర్వాత మైనర్ చిన్నారుల కస్టడీ (లీగల్ ప్రొటెక్షన్) విషయంలోనూ న్యాయమూర్తులు తుది నిర్ణయం తీసుకునేలా ముసాయిదాలో పేర్కొన్నారు. మాటల ద్వారానైనా, ఎస్‌ఎంఎస్, ఈ–మెయిల్, వాట్సప్ సందేశాల ద్వారానైనా ట్రిపుల్ తలాక్ చెప్పటం చెల్లదని స్పష్టం చేశారు. ముసాయిదాకు ఆమోదం లభిస్తే.. జమ్మూకశ్మీర్ మినహా దేశమంతా కొత్త చట్టం అమల్లోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment