కార్డుతో చెల్లిస్తే ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం లబ్ధి చేకూర్చనుంది. క్రెడిట్, డెబిట్ కార్డులతో లావాదేవీలు జరిపే వినియోగదారులకు ప్రోత్సహకాలు ఇవ్వాలని ఆలోచిస్తుంది. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్, రైల్వే టికెట్ల బుకింగ్ లావాదేవీల ఛార్జీలు తొలగించే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ముఖ్యంగా నల్లధనాన్ని అరికట్టే ఉద్దేశంతోనే ఈ సరికొత్త ఆలోచనకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఎలక్ట్రానిక్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపే వారికి కచ్చితంగా పన్ను చెల్లింపుల్లో రాయితీ కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు తయారు చేసినట్లు సమాచారం. గతంలో బడ్జెట్ సమావేశాల సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ 'నల్లధనం ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ఏకైక మార్గం డబ్బు రూపంలో చెల్లింపులను నిలువరింప జేయడం' అని ప్రకటించారు. లక్ష రూపాయలకు పైబడి చెల్లించేవారు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ కార్డు ద్వారానే చెల్లించాలనే ప్రతిపాదన కూడా ఆ సమయంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే.