గో మూత్రం క్యాన్సర్‌కు మందా?
గో మూత్రం క్యాన్సర్‌కు మందా?
Published Thu, Feb 16 2017 6:04 PM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM
న్యూఢిల్లీ: గో మూత్రంతో క్యాన్సర్ నయం అవుతుందా? ఈ విషయాన్ని తెలుసుకునేందుకే కేంద్ర ప్రభుత్వం గో మూత్రం పరిశోధనల కోసం ఓ కమిటీని వేయాలని నిర్ణయించింది. గో మూత్రంతో కీళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలు నయం అవుతాయనే అపోహ లేదా నమ్మకం భారతీయుల్లో ఉంది. అందుకనే మానవుల ఆరోగ్యం పరిపుష్టికి తాగేందుకు, నేలను శుభ్రచేయడానికి గో మూత్రంతో తయారు చేసిన ఔషధాలను పతంజలి బ్రాండ్ ప్రమోట్ చేస్తోంది. ఇండోర్‌లో నైతే ఏకంగా గో మూత్రంతో థెరపీ అంటూ ఓ ఆస్పత్రే వెలసింది. ఎంత అన్నది కచ్చితంగా తెలియదుగానీ దేశంలో ఆవు మూత్రంతో కోట్లది రూపాయల వ్యాపారం జరుగుతోంది.
అందుకనే కేంద్ర ప్రభుత్వం గోమూత్రం అమ్మకాలపై పన్నును కూడా విధించింది. క్యాన్సర్ నుంచి డెంగ్యూ జ్వరం వరకు రోగాలను నయం చేయడంలో గో మూత్రం ఏ మేరకు ప్రభావం చూపించగలదో కనుగొనేందుకు చేపట్టాల్సిన ప్రయోగాలు ఏమిటీ, వాటికి ఎంత ఖర్చవుతుందో అన్న అంశాలను తాము ఏర్పాటు చేయబోయే కమిటీ ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని, వాటిని కేంద్రంలోని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖకు పంపిస్తుందని కమిటీకి కో-ఆర్డినేటర్‌గా నియమితులైన ఢిల్లీ ఐఐటీకి చెందిన డాక్టర్ కావ్య దషోరా తెలిపారు.
గోవును తల్లిగా భావించి పూజించడం, గోవునుంచి వచ్చే పాలు, పెరుగును ఆహారంగా తీసుకోవడం, యజ్ఞయాగాదులు, పూజలు, పునస్కారాల్లో ఆవు నెయ్యిని, గో మూత్రాన్ని ఉపయోగించడం హిందువుల సంస్కతి, సంప్రదాయం. గో మూత్రం వైరస్‌ను హరించి వేస్తుందన్న నమ్మకం ఉందని, అయితే కేవలం నమ్మకాలతో ముందుకు పోలేముకనుక, గో మూత్రంతో ప్రయోజనాలు ఏమిటో, రోగాలు నయం చేయడంలో దాని ప్రభావం ఏమిటో తెలుసుకునే లక్ష్యంతోనే ప్రభుత్వం కమిటీని వేస్తున్నట్లు డాక్టర్ కావ్య వివరించారు. ఈ నెలాఖరులోగా కమిటీ ఏర్పాటవుతుందని ఆమె తెలిపారు. వీరేంద్ర కుమార్ జైన్ అనే వ్యక్తి ఇండోర్‌లో గో మూత్రం థెరపి వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తమ థెరపికి ప్రజల నుంచి ఆదరణ ఎక్కువగా ఉందని, ఇప్పుడు తమ వద్ద 19 మంది డాక్టర్లు పని చేస్తున్నారని ఆయన తెలిపారు.
Advertisement