
విద్యాసాగర్‌రావుపై స్టాలిన్ తీవ్ర ఆరోపణలు
చెన్నై: తమిళనాడు గవర్నర్, కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తమిళనాడు తలెత్తిన రాజకీయ సంక్షోభం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందని మొదటి నుంచి చెబుతున్నామని అన్నారు. విపక్ష పార్టీలతో పాటు ఆయన బుధవారం గవర్నర్‌ను కలిశారు. సీఎం పళనిస్వామిపై విశ్వాసపరీక్షకు అనుమతించాలని గవర్నర్ కోరారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... భాగస్వామ్య పార్టీలతో పాటు రేపు ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నట్టు చెప్పారు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత కూడా తమిళనాడు ప్రభుత్వం చర్య తీసుకోకుంటే, కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కాగా, ఇప్పటివరకు రాజ్‌భవన్ చుట్టూ తిరిగిన తమిళ రాజకీయం ఇప్పుడు హస్తిన చేరనుంది. మరోవైపు సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం తమపై తప్పుడు ప్రచారం చేసేందుకేకేంద్ర మంత్రులను కలుస్తున్నారని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఆరోపించారు.