
తమిళ పాలి'ట్రిక్స్': మళ్లీ ట్విస్ట్
చెన్నై: తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారిక అన్నాడీఎంకే పార్టీలో తలెత్తిన విభేదాలు ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి సంకటంగా మారాయి. పన్నీర్ సెల్వం వర్గం విలీనం కావడంతో అన్నాడీఎంకేలో మరోసారి సంక్షోభం నెలకొంది.
శశికళ వర్గం ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో పళనిస్వామి సర్కారు మైనార్టీలో పడింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ చురుగ్గా పావులు కదుపుతున్నారు. మంగళవారం ఆయన గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుకు లేఖ రాశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి తక్షణమే శాసనసభలో బలం నిరూపించుకునేలా ఆదేశించాలని లేఖలో కోరారు. పళనిస్వామి సర్కారును ప్రజాస్వామ్యయుతంగా సాగనంపుతామని స్టాలిన్ ఇంతకుముందే ప్రకటించారు.
మరోవైపు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు శశికళ వర్గం చర్యలు చేపట్టింది. తమ దగ్గరున్న 19 మంది ఎమ్మెల్యేలను పుదుచ్చేరికి తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. తమకు ప్రభుత్వం కంటే పార్టీ ముఖ్యమని శశికళ వర్గం ఎమ్మెల్యే పి వెట్రివేల్ అన్నారు. పార్టీని కాపాడుకునేందుకే పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించామని చెప్పారు. తమ ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని రిసార్ట్‌కు తరలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
కాగా, శశికళను పార్టీ నుంచి తప్పించాలన్న అన్నాడీఎంకే ఎంపీ వైద్యలింగంను దినకరన్ తొలగించారు. మరోవైపు ప్రభుత్వానికి కాపాడుకునేందుకు ఈపీఎస్-ఓపీఎస్ ప్రయత్నిస్తోంది. శశికళ వర్గం ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు తెరవెనుక మంతనాలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.