
స్టాలిన్ కొత్త వ్యూహం!
సాక్షి, చెన్నై : తమిళనాట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చెన్నైకి రావాలని తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కబురు పంపారు. అన్నాడీఎంకే సర్కారును గద్దె దించడం లక్ష్యంగా అందివచ్చే అవకాశాలన్నింటినీ స్టాలిన్ ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, 18మంది ఎమ్మెల్యేలపై వేటు వేసి బలపరీక్షలో నెగ్గాలన్న సీఎం పళనిస్వామి వ్యూహ రచనతో స్టాలిన్ అప్రమత్తం అయ్యారు. ఆగమేఘాలపై తన ఎమ్మెల్యేలను చెన్నైకి రావాలని వర్తమానం పంపారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు అన్నా అరివాలయంలో భేటీకి నిర్ణయించారు.
పళని సర్కారుపై ప్రజల్లోనూ అసంతృప్తి బయలుదేరి ఉన్న దృష్ట్యా మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకుగాను డీఎంకే ఎమ్మెల్యేలు 89 మందితోపాటు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు చెందిన ఒకరు, కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిదిమందితో మూకుమ్మడిగా రాజీనామా చేయిస్తే రాష్ట్రం రాష్ట్రపతి పాలన దిశగా సాగేందుకు వీలుందన్న పథకంతో ఈ అత్యవసర భేటీ ఏర్పాటు చేసినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. దొడ్డిదారిన బల పరీక్షలో పళని నెగ్గిన పక్షంలో మరో ఆరు నెలలు లేదా ఏడాది పాటు ఇబ్బందులు లేకుండా ముందుకు సాగే అవకాశాలున్నాయి. అందుకే బలపరీక్షకు ఆస్కారం లేని రీతిలో తామే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లే విధంగా ముందడుగు వేయవచ్చన్న ప్రచారం తమిళనాట ఊపందుకుంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం తమదే అన్న ధీమా డీఎంకేలో పెరగడమే ఇందుకు నిదర్శనంగా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో సోమవారం పార్టీ న్యాయవాద విభాగం కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి, సీనియర్ న్యాయవాది షణ్ముగ సుందరం తదితరులతో స్టాలిన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాము తీసుకునే నిర్ణయానికి ఏమైనా న్యాయ, చట్టపరంగా చిక్కులు ఎదురవుతాయా అన్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.