
భద్రత పెంచండి
కేంద్ర హోం శాఖ ఆదేశం
న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రికులపై దాడి నేపథ్యంలో కశ్మీర్‌లో తాజా పరిస్థితిని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం సమీక్షించారు. అమర్‌నాథ్ యాత్రకు భద్రతను మరింత పెంచాలని ఆయన ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. దాదాపు గంట పాటు సాగిన సమావేశంలో.. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే రెండు మార్గాల వద్ద భద్రతా పరిస్థితిపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం శాఖ, నిఘా విభాగాలు, సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. యాత్రికుల భద్రత కోసం అమర్‌నాథ్ యాత్ర కొనసాగే మార్గాల్లో రాష్ట్ర పోలీసులతో పాటు దాదాపు 21 వేల మంది పారామిలటరీ బలగాలు పహారా కాస్తున్నాయి.
సూరత్‌కు మృతదేహాలు: అమర్‌నాథ్ యాత్రలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు యాత్రికుల మృతదేహాల్ని భారతీయ వాయుసేనకు చెందిన హెర్క్యులస్ విమానంలో సూరత్ ఎయిర్‌పోర్ట్‌కు తెచ్చారు. ఈ విమానంలోనే క్షతగాత్రులు కూడా గుజరాత్ చేరుకున్నారు. విమానం నుంచి ఒక్కో మృతదేహాం బయటికి తెస్తుండగా బంధువుల కన్నీటి రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. మృతుల్లో ఐదుగురు గుజరా త్ వాసులు కాగా, మరో ఇద్దరు మహారాష్ట్రీయులు. మృతుల కుటుంబాలకు రూ. 7 లక్షలు, గాయపడ్డవారికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం చెప్పింది. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ. 6 లక్షలు, రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. గుజరాత్ ప్రభుత్వం మృతుల కుటుం బాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు పరిహారం ప్రకటించింది.
ప్రపంచ దేశాల ఖండన
అమర్‌నాథ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. యాత్రికులపై దాడిని గర్హిస్తున్నామని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ ట్వీట్ చేశారు. జర్మనీ ప్రభుత్వం తరఫున ఈ దాడిని ఖండిస్తున్నట్లు ఆ దేశ రాయబారి మార్టిన్ చెప్పారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కూడా ఖండించారు.