
యూపీ ఎన్నికల్లో మహాకూటమి?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 2017లో జరిగే ఎన్నికల్లో వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకుని, మహాకూటమిగా పోరాడే అవకాశం ఉందని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ చెప్పారు. అయితే ఏయే పార్టీలతో పొత్తులు ఉండొచ్చనే విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. అయితే, సమాజ్‌వాదీ - బీఎస్పీల మధ్య పొత్తు ఉండొచ్చని ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి ఫరీద్ మహఫూజ్ కిద్వాయ్ అంతకుముందు వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పటివరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అయితే, బిహార్‌లో అంతకుముందు కూడా జేడీయూ - ఆర్జేడీల మధ్య అలాంటి పరిస్థితే ఉన్నా.. ఆ రెండు పార్టీలు కూటమిగా పోటీ చేస్తే సత్ఫలితాలు వచ్చిన విషయాన్ని ఆ మంత్రి గుర్తుచేశారు.
బిహార్ తరహాలోనే.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కూడా బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. బిహార్ ప్రజలు అభివృద్ధికే ఓటు వేశారని సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. యూపీ పంచాయతీ ఎన్నికల్లో కూడా తమ పార్టీ అభివృద్ధి ఎజెండాకు మద్దతు ఇచ్చారని తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాము ఈ ఎజెండాతోనే పోటీకి దిగుతామని చెప్పారు.