రాష్ట్రపతి భవన్లో ఒబామాకు స్వాగతం
భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా ప్రథమ పౌరుడు బరాక్ ఒబామాకు రాష్ట్రపతి భవన్లో సాదర స్వాగతం లభించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒబామాను స్వాగతించారు. రాష్ట్రపతి భవన్లోని ఫోర్కోర్ట్ ప్రాంతంలో రెడ్ కార్పెట్ పరిచి రాష్ట్రపతి భవన్లో ఒబామాను స్వాగతించారు. ఆయనకు పూర్తిస్థాయి సైనిక వందనం లభించింది. తుపాకులను 21 రౌండ్లు గాల్లోకి పేల్చి.. రిపబ్లిక్ డే అతిథికి స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్ ప్రధాన గేటు వద్ద నుంచి అశ్వికదళం తోడు రాగా ఒబామా ప్రయాణిస్తున్న 'ద బీస్ట్' వాహనం నెమ్మదిగా లోపలకు వచ్చింది. తర్వాత తొలుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను స్వాగతించారు. అక్కడినుంచి సైనిక వందనం స్వీకరించే వేదిక వద్దకు ఒబామా చేరుకున్నారు. త్రివిధ దళాధిపతులు కూడా రాష్ట్రపతి భనవ్ వద్ద ఒబామాకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కేంద్ర మంత్రులు మనోహర్ పారిక్కర్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు ఉదయమే రాష్ట్రపతి భవన్ వద్దకు చేరుకున్నారు.
తొలుత షెడ్యూలు కంటే పావుగంట ముందుగానే వచ్చిన ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ఒబమాకు ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా విమానాశ్రయంలో స్వాగతం పలికిన విషయం తెలిసిందే. విమానశ్రయం నుంచి తొలుత ఐటీసీ మౌర్య హోటల్కు వెళ్లి అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న ఒబామా.. అటు నుంచి నేరుగా తన 'ద బీస్ట్' కారులో రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు.