
అహ్మదాబాద్ : పిల్లలు, పెద్దలు అనే తేడాలేకుండా చాలామంది పబ్‌జి గేమ్ ఆడుతూ ‘బిజీ’ అయిపోతున్నారు. అయితే గంటల తరబడి ఈ గేమ్ ఆడడంతో మానసిక రుగ్మతలు వచ్చే అవకాశాలున్నాయని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇక విద్యార్థులు అదే పనిగా ఈ ఆటలో పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ ప్రభుత్వం పబ్‌జి గేమ్ నియంత్రణకై చర్యలు చేపట్టింది. ప్రైమరీ స్కూల్ విద్యార్థులు పబ్‌జి గేమ్ ఆడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది.
చదువును నిర్లక్ష్యం చేస్తూ..విద్యార్థులు ఈ గేమ్‌కు అడిక్ట్ అవుతున్నారని ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (గుజరాత్) చైర్ పర్సన్ జాగృతి పాండ్యా చెప్పారు. అందుకనే పబ్‌జిపై నిషేదం విదించాలని ప్రభుత్వానికి సూచించినట్టు తెలిపారు. ఈ గేమ్‌ను దేశవ్యాప్తంగా నిషేధించాలని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సిఫారసు చేసిందని పాండ్యా వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. పబ్‌జి గేమ్‌కు అడిక్ట్ అయిన ఓ వ్యక్తి ఇటీవల మతి స్థిమితం కోల్పోయాడు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఓ ఫిట్‌నెస్ ట్రెయినర్ 10 రోజులపాటు అదేపనిగా పబ్‌జి గేమ్ ఆడాడు. దాంతో అతను మతి స్థిమితం కోల్పోయాడు. గేమ్ ప్రభావం వల్ల తనను తానే గాయ పరుచుకుంటూ, చిత్రహింసలు పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నాడు. ఈ మొబైల్ గేమ్ ఇతర గేమ్స్‌లా కాదు. అందులో మునిగిపోయారంటే గంటల తరబడి గేమ్ ఆడవచ్చు. ఎందుకంటే ఇది సమూహంగా ఆడే ఆట. ఇక గేమ్ ఫినిష్ చేయకపోతే ఏదో కోల్పోయామన్న భావన ప్లేయర్లలో కలుగుతున్నది. దీంతో పబ్‌జికి చాలా మంది అడిక్ట్ అవుతున్నారు.