సింగర్ పై నోట్ల వర్షం..! | Gujarat Singer Kirtidan Gadhvi Showered With Wads Of Cash | Sakshi
Sakshi News home page

సింగర్ పై నోట్ల వర్షం..!

Published Sun, Feb 19 2017 9:15 AM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM

సింగర్ పై నోట్ల వర్షం..! - Sakshi

సింగర్ పై నోట్ల వర్షం..!

అహ్మదాబాద్: గుజరాతీ సంప్రదాయంతో మరో సింగర్ వివాదంలో చిక్కుకున్నాడు. వల్సాద్ జిల్లాలోని వాపి పట్టణంలో ఓ సాంస్కృతిక కార్యక్రమానికి ఫోక్ సింగర్ కీర్తిధన్ గధ్వి హాజరయ్యాడు. స్వామి నారాయణ్ కాంప్లెక్స్ లో తన పాటలతో అక్కడి వారిలో ఉత్సాహాన్ని నింపాడు. అయితే ఆయన పాడటం మొదలుపెట్టింది తరవాయి.. వారిపై నోట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. దీంతో ఆయనకు కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. తొలిసారిగా 2015లో జామ్ నగర్‌లో ఓ ఈవెంట్లో రూ. 4 కోట్ల నగదు రాబట్టి వెలుగులోకి వచ్చాడు కీర్తిధన్.

సింగర్ కీర్తిధన్ గధ్వి, ఆయన బృంధంపై ఈవెంట్ ముగిసేవరకూ రూ.100, రూ.500 నోట్లు, కొందరైతే రూ.50, రూ.10 నోట్లను చల్లుతూనే ఉన్నారు. డబ్బులు ఇలా చల్లడం ఏంటి, అవి ఎవరిస్తున్నారు, వారికి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. అసలు ఆ డబ్బుతో మీరు ఏం చేస్తారన్న ప్రశ్నలు ఆయనను చుట్టుముట్టాయి. లక్షల్లో రూపాయలు ఆయనపై కురిపించగా.. నగదు ఎంతో లెక్క మాత్రం తెలపలేదు. ఓవైపు ఏంతో మంది చేతికి డబ్బులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఇలా నోట్లను చల్లుతున్నారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సింగర్ కీర్తిధన్ నోట్ల వర్షంపై స్పందిస్తూ.. 'ఇలా చేయడమన్నది గుజరాతీ సంప్రదాయంలో ఓ భాగం. ఈ నగదును సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తాను. డబ్బు దొరికింది కదా అని వృథా చేసే ప్రసక్తే లేదు. మంచి కార్యక్రమాలకు ఖర్చు చేస్తాం' అని చెప్పాడు. గతేడాది దక్షిణ గుజరాత్ లో ఓ సింగర్ నవరాత్రి ఉత్సవాలలో కచేరీ పెట్టగా.. దాదాపు రూ.40 లక్షల నగదును ఆయనపై కురిపించడం అప్పట్లో వివాదాస్పదమైంది. నోట్ల రద్దు తర్వాత కొత్త రూ.500, రూ.2000 నోట్లను విచ్చలవిడిగా చల్లుతూ ఈవెంట్ నిర్వహించడంపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. తాజాగా సింగర్ కీర్తిధన్ ఈవెంట్లోనూ ఇలాగే నోట్లవర్షం కురిపించడంపై విమర్శలు తలెత్తుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement