జమ్మూ: జమ్మూకశ్మీర్ మళ్లీ కాల్పుల మోతతో హోరెత్తుతోంది. పూంచ్ జిల్లాలో సోమవారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతోన్నాయి. నిన్న ఉగ్రవాదులు పూంచ్లోని మినీ సెక్రటేరియట్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనం వద్ద కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. అదే ప్రాంతంలో మళ్లీ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
ఇక నిన్న జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరణించినవారిలో ముగ్గురు ఉగ్రవాదాలు కాగా, ఓ కానిస్టేబుల్ ఉన్నారు. ఎదురు కాల్పుల్లో మరో అయిదుగురు గాయపడ్డారు. వారిలో ఓ పోలీస్ అధికారితో పాటు, ముగ్గురు జవాన్లు, ఓ సాధారణ వ్యక్తి ఉన్నారు. ఇక పూంచ్లో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.