జవాన్ చెంప పగల కొట్టిన మహిళ
సాక్షి, న్యూఢిల్లీ: గుర్‌గావ్‌లో ఓ మహిళ వీడియో తెగ వైరల్ అవుతోంది. విధి నిర్వహణలో ఉన్న ఓ జవాన్‌పై దాడి చేసి అతని చెంప పగలకొట్టింది. గత శనివారం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆమె అరెస్ట్‌తో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీకి చెందిన 44 ఏళ్ల మహిళ స్మృతి కల్రా భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నారు. గత శనివారం మధ్యాహ్నా సమయంలో తన టాటా ఇండికా కారులో బయటకు వెళ్లారు. ఇంతలో ఏం జరిగిందో తెలీదుగానీ ముందు వెళ్తున్న ఆర్మీ ట్రక్కుకు తన వాహనానికి ఆమె అడ్డుగా నిలిపారు. కారు దిగి అంతే వేగంగా నడుచుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న ఓ జవాన్ చెంప పగలకొట్టారు. అతను మాట్లాడే లోపే మరో రెండు.. మూడు దెబ్బలు చరిచి ఆమె తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అక్కడే పక్కనే కారులో ఉన్న మరో వ్యక్తి అదంతా తన మొబైల్ ఫోన్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ విషయమై అర్మీ వర్గాలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. వెంటనే జడ్జి స్మృతికి బెయిల్ మంజూరు చేశారు. నన్ను నోరు తెరిచి మాట్లాడనివ్వలేదు. ఎందుకలా కొడుతోంది? ఆమెకేమైనా పిచ్చా? అనుకున్నా అని బాధిత జవాన్ తెలిపారు. తన కారును ఓవర్ టేక్ చేఏసిందనందుకే స్మృతి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.