
నేను నపుంసకుడిని: గుర్మీత్
సాక్షి, న్యూఢిల్లీ/చండీగఢ్ : అత్యాచారాల కేసులో 20 ఏళ్ల జైలుశిక్షకు గురైన ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ సింగ్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. కీలకాంశం ఏంటంటే.. శిక్ష నుంచి బయటపడేందుకు తానో నపుంసకుడినని ఈ రాక్‌స్టార్ బాబా చెప్పుకున్నారు. అయితే తాను 1990 నుంచి నపుంసకుడిగా మారానని, అలాంటిది 1999 ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో తాను ఇద్దరు మహిళలను అత్యాచారం చేశానన్నది అసత్య ప్రచారమేనని పేర్కొన్నారు. అసలు ఆ ఆరోపణల్లో ఇసుమంతైనా నిజంలేదని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణలో భాగంగా జస్టిస్ జగ్దీప్ కుమార్‌కు ఆయన చెప్పుకొచ్చారు.
తాను అమాయకుడినని, ఎలాంటి తప్పులు చేయలేదని న్యాయమూర్తికి విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయింది. గుర్మీత్ చెప్పేవన్నీ అసత్యాలేనని సీబీఐ న్యాయస్థానం గుర్తించింది. మీకు ఇద్దరు కూతుళ్లున్నారు కదా.. దీనిపై మీ సమాధానం ఏంటని ప్రశ్నించగా గుర్మీత్ మౌనం వహించినట్లు సమాచారం. ఆపై ఈ కేసులో బాధితురాలు గుర్మీత్ గురించి మరిన్ని విషయాలు తెలిపారు.
అశ్రమంలో తమపై జరిగిన లైంగిక దాడుల గురించి ఇంట్లో వాళ్లకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్మీత్ బెదిరించేవారని చెప్పారు. కుటుంబ సభ్యులను హత్య చేయిస్తానని పలుమార్లు హెచ్చరించినట్లు కోర్టుకు బాధితురాలు వెల్లడించారు. నిందితుడు బాబాకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నట్లు చెప్పడంతో పాటు బాధితురాలి ఫిర్యాదు వివరాలను పరిశీలించిన తర్వాతే సీబీఐ కోర్టు గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలుశిక్షతో పాటుగా ఒక్కో కేసులో రూ. 15 లక్షల చొప్పున జరిమానా విధించిన విషయం తెలిసిందే.