
చండీగఢ్: సెలబ్రిటీలు పాల్గొనే ప్రముఖ టెలివిజన్ కార్యక్రమం బిగ్‌బాస్ తరహా షోను డేరా సచ్చా సౌదాలో చీఫ్ గుర్మీత్ సింగ్ నిర్వహించేవారట. గుర్మీత్ దత్తత తీసుకున్నట్లుగా చెప్తున్న హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా ఈ విషయాన్ని శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అత్యాచార కేసుల్లో దోషిగా తేలిన గుర్మీత్ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తుండటం తెలిసిందే.
‘డేరాలో బిగ్‌బాస్ తరహా కార్యక్రమాన్ని గుర్మీత్ 6 జంటలతో నిర్వహించేవారు. 28 రోజులపాటు 6 జంటలు అక్కడ నివసించేవి’ అని ఆయన తెలిపారు. గుర్మీత్‌కు హనీప్రీత్ దత్తపుత్రిక అని చెప్పడం కేవలం ఒక ముసుగు అనీ, వారిద్దరూ భార్యాభర్తల్లానే ఉండేవారని విశ్వాస్ స్పష్టం చేశారు. చట్టబద్ధంగా పెళ్లి చేసుకోకపోయినా 2009 నుంచి హనీప్రీత్ గుర్మీత్‌కు భార్యగా అతని వద్దే ఉంటోందన్నారు.
హనీప్రీత్ గుర్మీత్ ప్రియురాలు
విశ్వాస్ మాట్లాడుతూ ‘హనీప్రీత్ అసలు పేరు ప్రియాంక తనేజా. గుర్మీత్ చట్టబద్ధంగా ఆమెను దత్తత తీసుకోలేదు. పైకి అలా చెప్పుకున్నారంతే. ఆమె గుర్మీత్ ప్రియురాలు. 1999లో గుర్మీత్ ఆదేశాల మేరకే నేను హనీప్రీత్‌ను పెళ్లి చేసుకున్నా. వారిద్దరికీ లైంగిక సంబంధం ఉంది. అది నేనే ప్రత్యక్షంగా చూశాను. ఎవరికైనా చెబితే చంపేస్తానని అప్పట్లో గుర్మీత్ నన్ను బెదిరించారు. ఆమె ఎప్పుడూ గుర్మీత్‌తోనే ఉండేది.
డేరాలోని గుర్మీత్ నివాసం గుఫాలో వారిద్దరూ గడిపేవారు. ఇద్దరూ కలిసి నన్ను, నా కుటుంబాన్ని చాలాసార్లు బెదిరించారు. మాపై కేసులు పెట్టారు. నన్ను చంపేయమని గుర్మీత్ తన అనుచరులను ఆదేశించాడు. జైలులో ఉన్నా అతను చాలా బలవంతుడు. మీడియాతో మాట్లాడిన తర్వాత నేను బతికుంటానో లేదో కూడా తెలీదు’ అని చెబుతూ విశ్వాస్ మీడియా సమావేశం నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోయారు.