అల్లర్లకు డేరా బాబా సిగ్నల్ ఎలా ఇచ్చాడంటే...
ఎర్ర బ్యాగ్‌తో గుర్మీత్ ఏం సిగ్నల్ ఇచ్చాడంటే...
Published Thu, Aug 31 2017 11:48 AM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM
సాక్షి, ఛండీగఢ్: అత్యాచార కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను దోషిగా పంచకుల సీబీఐ స్పెషల్ కోర్టు ప్రకటించిన కాసేపటికే అల్లర్లు ఉవ్వెత్తున్న చెలరేగాయి. ఆయనను జైలుకు తీసుకెళ్తున్న సమయంలోనే ఏదో సంకేతాలు అందినట్లు క్షణాల్లోనే డేరా అనుచరులు ఒక్కసారిగా చెలరేగిపోయారు. దీనిపై హర్యానా పోలీస్ శాఖ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
గుర్మీత్ బట్టలు ఉన్నాయని చెబుతూ ఆయన దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్‌సాన్ చేతిలో ఓ ఎర్ర రంగు బ్యాగ్ తో రోహ్‌తక్ జైలు దాకా వెళ్లిన విషయం తెలిసిందే. ఆ బ్యాగ్ కలర్ ద్వారానే అల్లర్లకు సిగ్నల్ ఇచ్చి ఉంటారని ఐజీ కేకే రావు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆయన(గుర్మీత్)ను ప్రత్యేక వాహనంలో జైలుకు తరలించేందుకు సిద్ధం అయ్యాం. హనీప్రీత్ చేతిలో ఓ బ్యాగుతో వాహనం ఎక్కారు. సరిగ్గా అదే సమయంలో రెండు మూడు కిలోమీటర్ల అవతల టియర్ గ్యాస్ షెల్స్ పేలినట్లు శబ్ధం వినిపించింది. బహుశా తాను దోషిగా నిర్ధారణ అయ్యాక జైలు శిక్ష తప్పదని భావించిన గుర్మీత్ అనుచరులకు రెచ్చిపోవాలంటూ అలా సంకేతాలు ఇచ్చి ఉండొచ్చు’ అని రావు మీడియాకు వెల్లడించారు.
తీర్పు సమయంలో పంచకుల కోర్టు ఆవరణలోనే హనీప్రీత్ ఉన్నారు. 2-3 కిలోమీటర్ల దాకా ఎవరినీ అనుమతించలేం. తీర్పు వెలువడ్డాక జైలుకు తరలించేందుకు కొంచెం సమయం పట్టింది. ఆ మధ్యలోనే అనుచరులకు సంకేతాలు అంది ఉంటాయని భావిస్తున్నట్లు రావు తెలిపారు.
అందుకే అలా తరలించాం..
గుర్మీత్‌ను దోషిగా నిర్థారించాక రోహ్‌తక్ జైలుకు తరలించే క్రమంలో ముందు ప్రత్యేక చాపర్ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాలి. అయితే 70 వాహనాల భారీ కాన్వాయ్ తో వచ్చిన కోర్టుకు వచ్చిన ఆయనను.. అనుచరులు దాడి చేస్తారన్న అనుమానంతో తిరిగి అదే దారిలో తీసుకెళ్లే సాహసం చేసుకోదల్చుకోలేదు. అందుకే మరో మార్గం అయిన కంటోన్మెంట్ ఏరియా(పికెట్) గుండా తీసుకెళ్లేందుకు ఆర్మీ అధికారి అనుమతి కోరాం. నిబంధనల దృష్ట్యా అనుమతి లేకపోయినా.. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారి అందుకు అంగీకరించారు.
చివరకు ఆ దారి గుండా వెళ్తున్న సమయంలో కూడా కొందరు అనుచరులు దాడికి యత్నించారు. ఆయుధాలతో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని ముందుకు సాగాం. ఆ ఆరగంటలో గుర్మీత్‌ను ఎటు వైపు తీసుకెళ్లామో తెలీక కోర్టు బయట ఉన్న అనుచరులు అయోమయంలో పడిపోయారు. చివరకు చాపర్ ఉన్న ప్రాంతానికి వెళ్లేంత వరకు అధికారులందరి ముఖంలో టెన్షన్ నెలకొందని ఐజీ రావు చెప్పుకొచ్చారు.
Advertisement