Honey Preet Singh Insan
-
ముప్పుతిప్పలు పెడుతున్న హనీప్రీత్
సాక్షి, చండీగఢ్ : హరియాణా పోలీసుల నుంచి 38 రోజులపాటు తప్పించుకు తిరుగుతూ ముప్పు తిప్పలు పెట్టిన డేరా బాబా గుర్మీత్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పోలీసుల ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. పంచకుల అల్లర్ల కేసులో పోలీసు అధికారులు ఆమెను మొత్తం 40 ప్రశ్నలు అడగ్గా కేవలం రెండు ప్రశ్నలకు మాత్రమే సూటిగా సమాధానం ఇచ్చారు. 13 ప్రశ్నలకు అసలు సమాధానం ఇవ్వడానికే హనీప్రీత్ నిరాకరించారు. మిగతా 25 ప్రశ్నలకు కాదని, లేదా గందరగోళమైన సమాధానాలు ఇచ్చారు. కోర్టు మొత్తం ఆరు రోజుల కస్టడీ ఇచ్చినందున మరో రెండు పర్యాయాలు ఆమెను విచారిస్తామని, అప్పటికీ హనీప్రీత్ సరైనా సమాధానాలు ఇవ్వక పోయినట్లయితే నార్కో పరీక్షలకు అనుమతి కోరుతామని పంచకుల పోలీసు కమిషనర్ ఏస్ చావ్లా తెలిపారు. డేరా వాహనాల్లో ఎందుకు అక్రమ ఆయుధాలు తీసుకెళ్లారు, సిర్సా వద్ద డేరా వాహనాలన్ని ఎందుకు తగలబెట్టారు, అల్లర్లు సృష్టించేందుకు డేరా అనుచరులకు ఐదు కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చారు, అంతర్జాతీయ సిమ్ కార్డుతోపాటు పలు భారత సిమ్ కార్డులను మార్చి మార్చి మాట్లాడడం గురించి అడిగిన ప్రశ్నలకు హనీప్రీత్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారు. డేరా నుంచి పారిపోయిన డాక్టర్ ఆదిత్యతో వాట్సాప్‌లో చేసిన చాటింగ్‌కు సంబంధించిన రెండు ప్రశ్నలకు మాత్రమే ఆమె సరైన సమాధానాలు ఇచ్చారని పోలీసు కమిషనర్ చావ్లా చెప్పారు. ఆజ్‌తక్, ఇండియా టుడీ టీవీలకు గురువారం ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత హానీప్రీత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. పంచకులలో జరిగిన అల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అమాయకురాలినని ఆమె టీవీ ఛానళ్లతో చెప్పారు. పంచకుల అల్లర్లలో 30 మంది మరణించడం, 350 మందికిపైగా గాయపడడం తెల్సిందే. ఈ కేసులో హనీప్రీత్‌ను అరెస్ట్ చేయగానే హరియాణా పోలీసులు ఆమెను 43 మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో చేర్చారు. కోర్టు ఆమెను ఆరు రోజుల కస్టడీకి అప్పగించాక ఇన్ని రోజులు పాటు పంజాబ్, హరియాణాలోని ఏయే ప్రాంతాల్లో తలదాచుకున్నారో అక్కడకి హనీప్రీత్‌ను తీసుకొని పోలీసు వెళ్లారు. ఆమెతో కొన్ని రోజులు గడిపిన డేరా బాబా గుర్మీత్ డ్రైవర్ ఇక్బాల్ సింగ్ భార్య సుఖ్దీప్ సింగ్‌ను కూడా తీసుకొని బటిండాకు పోలీసులు వెళ్లారు. అక్కడ హానీప్రీత్ నాలుగు రోజులపాటు తన మామతో కూడా ఉన్నారు. ఆమె వెళ్లిన సంగ్రూర్, తాపమండి, రాంపుర ప్రాంతాలకు కూడా పోలీసులు వెళ్లి ప్రాథమిక విచారణ జరిపారు. -
అల్లర్లకు డేరా బాబా సిగ్నల్ ఎలా ఇచ్చాడంటే...
సాక్షి, ఛండీగఢ్: అత్యాచార కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను దోషిగా పంచకుల సీబీఐ స్పెషల్ కోర్టు ప్రకటించిన కాసేపటికే అల్లర్లు ఉవ్వెత్తున్న చెలరేగాయి. ఆయనను జైలుకు తీసుకెళ్తున్న సమయంలోనే ఏదో సంకేతాలు అందినట్లు క్షణాల్లోనే డేరా అనుచరులు ఒక్కసారిగా చెలరేగిపోయారు. దీనిపై హర్యానా పోలీస్ శాఖ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గుర్మీత్ బట్టలు ఉన్నాయని చెబుతూ ఆయన దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ చేతిలో ఓ ఎర్ర రంగు బ్యాగ్ తో రోహ్తక్ జైలు దాకా వెళ్లిన విషయం తెలిసిందే. ఆ బ్యాగ్ కలర్ ద్వారానే అల్లర్లకు సిగ్నల్ ఇచ్చి ఉంటారని ఐజీ కేకే రావు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆయన(గుర్మీత్)ను ప్రత్యేక వాహనంలో జైలుకు తరలించేందుకు సిద్ధం అయ్యాం. హనీప్రీత్ చేతిలో ఓ బ్యాగుతో వాహనం ఎక్కారు. సరిగ్గా అదే సమయంలో రెండు మూడు కిలోమీటర్ల అవతల టియర్ గ్యాస్ షెల్స్ పేలినట్లు శబ్ధం వినిపించింది. బహుశా తాను దోషిగా నిర్ధారణ అయ్యాక జైలు శిక్ష తప్పదని భావించిన గుర్మీత్ అనుచరులకు రెచ్చిపోవాలంటూ అలా సంకేతాలు ఇచ్చి ఉండొచ్చు’ అని రావు మీడియాకు వెల్లడించారు. తీర్పు సమయంలో పంచకుల కోర్టు ఆవరణలోనే హనీప్రీత్ ఉన్నారు. 2-3 కిలోమీటర్ల దాకా ఎవరినీ అనుమతించలేం. తీర్పు వెలువడ్డాక జైలుకు తరలించేందుకు కొంచెం సమయం పట్టింది. ఆ మధ్యలోనే అనుచరులకు సంకేతాలు అంది ఉంటాయని భావిస్తున్నట్లు రావు తెలిపారు. అందుకే అలా తరలించాం.. గుర్మీత్‌ను దోషిగా నిర్థారించాక రోహ్తక్ జైలుకు తరలించే క్రమంలో ముందు ప్రత్యేక చాపర్ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాలి. అయితే 70 వాహనాల భారీ కాన్వాయ్ తో వచ్చిన కోర్టుకు వచ్చిన ఆయనను.. అనుచరులు దాడి చేస్తారన్న అనుమానంతో తిరిగి అదే దారిలో తీసుకెళ్లే సాహసం చేసుకోదల్చుకోలేదు. అందుకే మరో మార్గం అయిన కంటోన్మెంట్ ఏరియా(పికెట్) గుండా తీసుకెళ్లేందుకు ఆర్మీ అధికారి అనుమతి కోరాం. నిబంధనల దృష్ట్యా అనుమతి లేకపోయినా.. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారి అందుకు అంగీకరించారు. చివరకు ఆ దారి గుండా వెళ్తున్న సమయంలో కూడా కొందరు అనుచరులు దాడికి యత్నించారు. ఆయుధాలతో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని ముందుకు సాగాం. ఆ ఆరగంటలో గుర్మీత్‌ను ఎటు వైపు తీసుకెళ్లామో తెలీక కోర్టు బయట ఉన్న అనుచరులు అయోమయంలో పడిపోయారు. చివరకు చాపర్ ఉన్న ప్రాంతానికి వెళ్లేంత వరకు అధికారులందరి ముఖంలో టెన్షన్ నెలకొందని ఐజీ రావు చెప్పుకొచ్చారు.