స్వైన్.. వణుకు!
స్వైన్.. వణుకు!
Published Wed, Aug 30 2017 2:42 AM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM
దేశంలో హెచ్1ఎన్1 విజృంభణ
- ఈ ఎనిమిది నెలల్లోనే 18,000 కేసులు నమోదు
- వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 871.. గత ఏడాదితో పోలిస్తే పది రెట్లు పెరిగిన కేసుల సంఖ్య
- మహారాష్ట్ర, గుజరాత్‌లో ఎక్కువ కేసులు, మరణాలు
దేశంలో స్వైన్‌ఫ్లూ(హెచ్1ఎన్1) వైరస్ భయం కొనసాగుతోంది.ఈ ఏడాది ఇప్పటి వరకూ సుమారు 18,000 మంది స్వైన్‌ఫ్లూ బారిన పడగా.. 871 మంది దీని వల్ల ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాదితో పోలిస్తే స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య ఈ ఏడాది పది రెట్లు పెరగడం గమనార్హం. 2016లో దేశవ్యాప్తంగా 1,786 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదుకాగా.. 265 మంది మృత్యువాతపడ్డారు. 2015లో స్వైన్‌ఫ్లూ దేశం యావత్తునూ వణికించింది.
ఆ ఏడాది సుమారు 42,500 మంది స్వైన్‌ఫ్లూ బారిన పడగా.. దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే స్వైన్‌ఫ్లూపై ప్రభుత్వ యంత్రాంగం స్పందన అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ ఏడాది మళ్లీ అది విజృంభించింది.
– సాక్షి, తెలంగాణ డెస్క్
50% మరణాలు మహారాష్ట్రలోనే
స్వైన్‌ఫ్లూ లేదా ఇన్‌ఫ్లుయెంజా ఏ అనేది హెచ్1ఎన్1 వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. ఇది తొలుత శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. సీజనల్ వ్యాధుల మాదిరిగానే దీని లక్షణాలు కూడా ఉంటాయి. ఒక్కసారిగా జ్వరం రావడం, శరీరం చల్లబడిపోవడం, గొంతుమంట, తలనొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. స్వైన్‌ఫ్లూ బారిన పడిన వారు తుమ్మినా, దగ్గినా వారి నుంచి ఇది ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ ఏడాది మహారాష్ట్రలో ఎక్కువ మంది స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు. ఇక్కడ 4,014 కేసులు నమోదైతే 414 మంది మరణించారు. దేశవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 50 శాతం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. గుజరాత్‌లో స్వైన్‌ఫ్లూతో 210 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 13–15 తేదీల మధ్య 3 రోజుల వ్యవధిలో ఇక్కడ 30 మంది స్వైన్‌ఫూకు బలయ్యారు.
ఎందుకీ పెరుగుదల..
స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య ఎక్కువగా వెలుగు చూడడానికి కారణం జాతీ య స్థాయిలో మంచి నిఘా వ్యవస్థ ఉండటం, మెరుగైన ప్రయోగశాల వ్యవస్థ ఉండటమేనని పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్ దేవేంద్ర మౌర్య వెల్లడించారు. 2015లో స్వైన్‌ఫ్లూ విజృంభించడంతో గతేడాది ఎక్కువ మంది ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నారని, ఈ ఏడాది చాలా తక్కువ మందే వ్యాక్సినేషన్ తీసుకోవడంతో కేసుల సంఖ్య పెరిగిందని వైద్య నిపుణులు చెపుతున్నారు.
సన్నద్ధత అంతంత మాత్రమే..
సీజనల్ ఫ్లూ వ్యాక్సినేషన్ అనేది దేశ జాతీయ వ్యాక్సినేషన్ పాలసీలో ఒక భాగం కాదు. దీనికితోడు హెచ్1ఎన్1 వైరస్ ప్రభావం ఎంత.. ఏటా ఇది ఏ విధంగా మారుతోంది తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర సరైన గణాంకాలు లేవు. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో త్వరగా స్వైన్‌ఫ్లూ వైరస్ బారిన పడుతున్నారని వైద్యులు చెపుతున్నారు. గర్భిణులు, ఆరోగ్య కార్యకర్తలు కూడా స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
Advertisement
Advertisement