Swine flu case
-
‘గాంధీ’లో అదే నిర్లక్ష్యం!
గాంధీఆస్పత్రి : ఎన్ని విమర్శలు వస్తున్నా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రాణాపాయస్థితిలో స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌తో వచ్చిన గర్భిణిని పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆస్పత్రి పాలనా యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పలువురు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పీజీలకు మెమోలు జారీ చేశారు. డీఎంఈ రమేష్‌రెడ్డితోపాటు ప్రభుత్వానికి సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్, జమ్మికుంటకు చెందిన నిండు గర్భిణి తీవ్రమైన జ్వరం, జలుబుతో మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరింది. నిర్ధారణ పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ రావడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు బుధవారం అర్ధరాత్రి 12.30 రిఫరల్‌పై గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. వెంటిలేటర్‌పై ఉన్న ఆమెకు తెల్లవారుజామున నొప్పులు వచ్చాయి. అయితే ఆ సమయంలో సదరు వార్డులో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పీజీ, సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యశాఖ ఉన్నతాధికారులతోపాటు మీడియాకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల సూచన మేరకు గాంధీ ఇన్చార్జి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు బుధవారం ఉదయం విచారణ చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్యసేవల్లో జాప్యం జరిగిన విషయం వాస్తమేనన్నారు. గర్భిణికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్ రావడంతో బుధవారం అర్ధరాత్రి గాంధీ ఆస్పత్రి స్వైన్‌ఫ్లూ వార్డులో అడ్మిట్ చేశామన్నారు. స్వైన్‌ఫ్లూతోపాటు ఇతర రుగ్మతలతో బాధపడుతున్న ఆమెకు అర్ధరాత్రి 1.45కు ఫిజీషియన్, 3 గంటలకు గైనకాలజీ డాక్టర్లు చికిత్స అందించారన్నారు. అయితే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల వరకు వైద్యులు, సిబ్బంది, పీజీలు అందుబాటులో లేరని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు తెలిపారు. అయితే, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ వాష్‌రూంకు వెళ్లాడని, నర్సులు వార్డులోని గదిలో ఉన్నారని, పీజీలు ఇతర రోగుల పనిపై వివిధ విభాగాలకు వెళ్లినట్లు తేలిందన్నారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, పీజీలకు మెమోలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై డీఎంఈ రమేష్‌రెడ్డితోపాటు ప్రభుత్వానికి సమాచారం అందించామన్నారు. తానే స్వయంగా గర్భిణికి వైద్యపరీక్షలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. సిజేరియన్ చేసి శిశువును బయటకు తీసి ఎన్ఐసీయూలో ఉంచినట్లు తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్న తల్లి పరిస్థితి విషమంగా ఉందన్నారు. స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు నిమిత్తం శిశువు నుంచి నమూనాలు సేకరించామన్నారు. గాంధీ నర్సింగ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 70 మంది కోవిడ్ అనుమానితులకు వైద్యపరీక్షలు... గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చేరిన 70మంది కోవిడ్ అనుమానితులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ వచ్చిందని ఇన్చార్జి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఇద్దరు స్వైన్‌ఫ్లూ పాజిటివ్ రోగులతోపాటు మరో ఐదుగురు అనుమానితులకు డిజాస్టర్ వార్డులో వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. -
స్వైన్‌ఫ్లూ కలకలం
నల్లగొండ టౌన్ : జిల్లాలో మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం మొదలైంది. తాజాగా జిల్లా కేంద్రంలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయి చలితీవ్రత పెరిగిపోవడంతో వ్యాధి చాపకిందనీరులా వ్యాపిస్తోంది. చలికాలంలో స్వైన్‌ఫ్లూ(హెచ్1ఎన్1) వ్యాధి ఇన్ఫ్లూయంజా ఎ వైరస్ వల్ల గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నెల రోజులుగా హైదరాబాద్‌లో స్వైఫ్లూతో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో అనేకమంది చేరిన విషయం విదితమే. పదుల సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయి. భాగ్యనగరానికి సమీపంలో జిల్లా ఉండడంతోపాటు ఇక్కడినుంచి రోజూ వందలాది మంది అక్కడికి వెళ్లి వస్తుంటారు. దీంతో స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య పెరిగిపోతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో పద్నాలుగు స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండు నెలల వ్యవధిలోనే ఇన్ని కేసులు నమోదు కావడం జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ఈ కేసులన్నీ పెద్దవూర, మిర్యాలగూడ, హాలియా, మర్రిగూడ, నల్లగొండ, కట్టంగూరు, త్రిపురారం మండలాల పరిధిలో నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వారందరూ గాంధీ ఆస్పత్రితోపాటు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొంది వ్యాధినుంచి విముక్తులయ్యారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ తాజాగా ఈ ఏడాది జనవరి నెలలో జిల్లా కేంద్రంలోనే రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో కలకలం రేపుతోంది. చలి కొంత తగ్గి వ్యాధి వ్యాప్తి లేదనుకుంటున్న తరుణంలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. వారిలో ఒకతను పాతబస్తీకి చెందినవ్యక్తికాగా, మరొకరు బీట్‌మార్కెట్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అధికారులు పేర్కొంటున్నారు. అందులో పాతబస్తీకి చెందిన వ్యక్తి గాంధీలో చికిత్స పొంది వ్యాధినుంచి విముక్తుడై వచ్చినప్పటికీ మరో వ్యక్తి మాత్రం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క స్వైన్‌ఫ్లూ మరణాలు లేవు. కానీ వ్యాధి బారిన పడుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఎవరైనా కనిపిస్తే వెంటనే వారి రక్తనమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ఐపీఎం(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటీవ్ మెడిసిన్) ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పటికే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో పది పడకలతో ప్రత్యేక స్వైన్‌ఫ్లూ వార్డును ఏర్పాటు చేశారు. పాజిటివ్ అని ఐపీఎం నివేదికలో తేలితే వెంటనే వారికి ప్రత్యేక వార్డులో చికిత్స అందించడానికి అవసరమైన మందులను కూడా అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. స్లైన్‌ఫ్లూ లక్షణాలు దగ్గు, ముక్కుకారడం, ఆయాసం, దమ్ము రావడం, ఊపిరి పీల్చేందుకు సైతం కష్టపడడం, పిల్లి కూతలు రావడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, గొంతులో గరగర, జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు, కళ్లనుంచి నీరు కారడం, చెవినొప్పి, చెవినుంచి చీము కారడం, చిన్న పిల్లలకు నిమ్ముచేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బహిరంగ ప్రదేశాల్లో ఏటీఎంలు, తలుపుల గొళ్లాలు, మొదలైన వాటిని వాడిన తరువాత, ప్రయాణాలను చేసిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కునే వరకు ముక్కు, కళ్లు, నోటిని ముట్టుకోవద్దు. చేతులను తరచూ సబ్సుతో శుభ్రంగా కడుక్కోవాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి, ముక్కుకు అడ్డంగా చేతి రుమాలు పెట్టుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగడంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. చలికాలంలో మంచుపడుతున్న సమయంలో బయటకు వెళ్లొద్దు. ఉన్నిదుస్తులను ధరించాలి. వేడివేడి ఆహారం తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. చిన్న పిల్లల శరీర ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉన్ని దుస్తులను వేయాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేం«ద్రం డాక్టర్‌ను సంప్రదించాలి. మందులు అందుబాటులో ఉంచాం స్వైన్‌ఫ్లూ చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రితోపాటు దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రుల్లో మాత్రలు, టానిక్లను సిద్ధంగా ఉంచాం. మా సిబ్బంది, వైద్యులను అప్రమత్తం చేశాం. గ్రామస్థాయిలో స్వైన్‌ఫ్లూపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. చలికాలంలో వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. జిల్లానుంచి నిత్యం హైదరాబాద్‌కు జిల్లానుంచి అనేకమంది రాకపోకలు సాగిస్తుంటారు. కాబట్టి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అనుమానిత కేసులు నమోదైతే వెంటనే మా ప్రత్యేక వైద్యబృందం వెళ్లి వారిని పరీక్షించడంతోపాటు చుట్లూ ఉన్న 50 ఇళ్లలోని వారికి కూడా పరీక్షలను చేయడానికి ఏర్పాట్లు చేశాం. – డాక్టర్ వై.గంగవరప్రసాద్, డీఎంహెచ్ఓ -
స్వైన్‌ఫ్లూ కలకలం
భువనేశ్వర్/ఖుర్దారోడ్ : రాష్ట్రంలో ఈ సీజన్లో తొలి స్వైన్‌ఫ్లూ కేసును ఖుర్దా జిల్లాలోని నచుని ప్రాంతంలో సోమవారం గుర్తించారు. కొద్దిరోజుల నుంచి జలుబు, దగ్గుతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఓ మహిళకు వైద్య పరీక్షలు చేయగా బాధిత మహిళకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదే విషయాన్ని స్థానిక ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం(ఆర్ఎంఆర్సీ) కూడా ఖరారు చేయడంతో స్వైన్‌ఫ్లూ కేసు వెలుగులోకి వచ్చింది. స్వైన్‌ఫ్లూ బారిన పడిన మహిళ 23 ఏళ్ల యువతి కావడం బాధాకరం. 2017లోనే రాష్ట్రం స్వైన్‌ఫ్లూ భయానక పరిస్థితులను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో సుమారు 400 మంది స్వైన్‌ఫ్లూ బారిన పడగా, 50 మంది చనిపోయినట్టు వైద్యవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు నగరంలో చోటు చేసుకున్న తాజా సంఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్వైన్‌ఫ్లూ విస్తరించకుండా తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
స్వైన్.. వణుకు!
దేశంలో హెచ్1ఎన్1 విజృంభణ - ఈ ఎనిమిది నెలల్లోనే 18,000 కేసులు నమోదు - వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 871.. గత ఏడాదితో పోలిస్తే పది రెట్లు పెరిగిన కేసుల సంఖ్య - మహారాష్ట్ర, గుజరాత్లో ఎక్కువ కేసులు, మరణాలు దేశంలో స్వైన్‌ఫ్లూ(హెచ్1ఎన్1) వైరస్ భయం కొనసాగుతోంది.ఈ ఏడాది ఇప్పటి వరకూ సుమారు 18,000 మంది స్వైన్‌ఫ్లూ బారిన పడగా.. 871 మంది దీని వల్ల ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాదితో పోలిస్తే స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య ఈ ఏడాది పది రెట్లు పెరగడం గమనార్హం. 2016లో దేశవ్యాప్తంగా 1,786 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదుకాగా.. 265 మంది మృత్యువాతపడ్డారు. 2015లో స్వైన్‌ఫ్లూ దేశం యావత్తునూ వణికించింది. ఆ ఏడాది సుమారు 42,500 మంది స్వైన్‌ఫ్లూ బారిన పడగా.. దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే స్వైన్‌ఫ్లూపై ప్రభుత్వ యంత్రాంగం స్పందన అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ ఏడాది మళ్లీ అది విజృంభించింది. – సాక్షి, తెలంగాణ డెస్క్ 50% మరణాలు మహారాష్ట్రలోనే స్వైన్‌ఫ్లూ లేదా ఇన్ఫ్లుయెంజా ఏ అనేది హెచ్1ఎన్1 వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. ఇది తొలుత శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. సీజనల్ వ్యాధుల మాదిరిగానే దీని లక్షణాలు కూడా ఉంటాయి. ఒక్కసారిగా జ్వరం రావడం, శరీరం చల్లబడిపోవడం, గొంతుమంట, తలనొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. స్వైన్‌ఫ్లూ బారిన పడిన వారు తుమ్మినా, దగ్గినా వారి నుంచి ఇది ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ ఏడాది మహారాష్ట్రలో ఎక్కువ మంది స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు. ఇక్కడ 4,014 కేసులు నమోదైతే 414 మంది మరణించారు. దేశవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 50 శాతం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. గుజరాత్లో స్వైన్‌ఫ్లూతో 210 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 13–15 తేదీల మధ్య 3 రోజుల వ్యవధిలో ఇక్కడ 30 మంది స్వైన్ఫూకు బలయ్యారు. ఎందుకీ పెరుగుదల.. స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య ఎక్కువగా వెలుగు చూడడానికి కారణం జాతీ య స్థాయిలో మంచి నిఘా వ్యవస్థ ఉండటం, మెరుగైన ప్రయోగశాల వ్యవస్థ ఉండటమేనని పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్ దేవేంద్ర మౌర్య వెల్లడించారు. 2015లో స్వైన్‌ఫ్లూ విజృంభించడంతో గతేడాది ఎక్కువ మంది ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నారని, ఈ ఏడాది చాలా తక్కువ మందే వ్యాక్సినేషన్ తీసుకోవడంతో కేసుల సంఖ్య పెరిగిందని వైద్య నిపుణులు చెపుతున్నారు. సన్నద్ధత అంతంత మాత్రమే.. సీజనల్ ఫ్లూ వ్యాక్సినేషన్ అనేది దేశ జాతీయ వ్యాక్సినేషన్ పాలసీలో ఒక భాగం కాదు. దీనికితోడు హెచ్1ఎన్1 వైరస్ ప్రభావం ఎంత.. ఏటా ఇది ఏ విధంగా మారుతోంది తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర సరైన గణాంకాలు లేవు. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో త్వరగా స్వైన్‌ఫ్లూ వైరస్ బారిన పడుతున్నారని వైద్యులు చెపుతున్నారు. గర్భిణులు, ఆరోగ్య కార్యకర్తలు కూడా స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. -
కోరుట్లలో స్వైన్‌ప్లూ కలకలం
గర్భిణికి పాజిటివ్ లక్షణాలు.. పరిస్థితి విషమం కోరుట్ల : కోరుట్ల పట్టణంలో స్వైన్‌ప్లూ కేసు కలకలం రేపింది. నెలక్రితం పట్టణంలోని రథాలపంపు వీధికి చెందిన గర్భిణి దావనపల్లి కల్యాణి(26) జ్వరం, దమ్ముతో స్థానిక ఆసుపత్రిలో చేరింది. మరికొన్ని రోజుల్లో డెలివరీకి ఉండగా విపరీతమైన జ్వరం, దమ్ముతో ఇబ్బంది పడుతుండగా మరో వైద్యుడికి రెఫర్ చేశారు. అక్కడ పరిశీలించి కరీంనగర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. నాలుగురోజుల క్రితం కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రి వైద్యులు డెలీవరి చేయగా బాబు పుట్టాడు. కల్యాణి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షల్లో స్వైన్‌ప్లూ పాజిటివ్‌గా తేల్చారు. ప్రస్తుతం వైరస్ తీవ్రస్థాయిలో ఉండడంతో కల్యాణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. నామమాత్రంగా స్పందించిన వైద్యాధికారులు కల్యాణికి స్వైన్‌ప్లూ వైరస్ సోకినట్లు హైదరాబాద్ యశోద వైద్యులు నిర్ధారించిన అనంతరం కోరుట్ల సివిల్ ఆస్పత్రి వైద్యాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కల్యాణికి పుట్టిన బాబుకు స్వైన్‌ప్లూ సమస్య ఉందేమోనన్న అనుమానంతో ఆమె తల్లిగారి స్వగ్రామం వెంకటాపూర్‌కు చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి వచ్చినట్లు సమాచారం. బాబుకు ఎలాంటి వైద్యపరీక్షలు చేయకుండా కోరుట్లలోనూ కల్యాణి నివాసముండే పరిసరాలను తూతూమంత్రంగా పరిశీలించినట్లు తెలిసింది. స్వైన్‌ప్లూ నివారణకు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వహించారు. -
‘గాంధీ’లో స్వైన్‌ఫ్లూ కేసు
-
‘గాంధీ’లో స్వైన్‌ఫ్లూ కేసు
హైదరాబాద్: రాష్ట్రాన్ని వణికించేందుకు స్వైన్‌ఫ్లూ మరోసారి సిద్ధమవుతోంది. ఈ వర్షాకాలంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మొదటి కేసు నమోదైంది. ఖమ్మం జిల్లాకు చెందిన కొణిజర్ల మండలం గుబ్బకుర్తి గ్రామానికి చెందిన సునీల్ (32) తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. వైద్యుల సూచన మేరకు కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చేర్పించారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కన్పించడంతో మెరుగైన వైద్య సేవల కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని డాక్టర్లు సూచించారు. దీంతో ఆగస్టు 29న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. సునీల్ నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా సోమవారం అందిన నివేదికల్లో స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే రోగిని ఏఎంసీ వార్డులో ప్రత్యేకంగా వైద్యసేవలు అందిస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో స్వైన్‌ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశముందని, గర్భిణీలు, బాలిం తలు, చిన్నారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నోడల్ అధికారి కె.నర్సింహులు సూచించారు. -
నంద్యాలలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదు
నంద్యాల(కర్నూలు): కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఓ వ్యక్తి(52)కి స్వైన్‌ఫ్లూ సోకినట్లు వైద్యులు శనివారం నిర్ధారించారు. వివరాలు...నంద్యాల పట్టణానికి చెందిన ఒక వ్యక్తి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో కొన్ని రోజుల క్రితం సన్‌షైన్ ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షల కోసం డాక్టర్లు ఆయన రక్త నమూనాలను హైదరాబాద్‌కు పంపగా బాధితుడికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. -
భాగ్యనగరిపై స్వైన్‌ఫ్లూ దాడి!
హైదరాబాద్ నగరంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న స్వైన్‌ప్లూ నగర ప్రజలకు తీవ్రఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా చలికాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోందని, మరో వారం రోజులపాటు నగర ప్రజలు స్వైన్‌ఫ్లూ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు కానీ, ఇళ్లలోంచి బయటకు రాకుండా తలుపులు మూసుకుంటే స్వైన్‌ఫ్లూ దాడికి గురికామనే హామీ ఏమైనా ఉందా? వైద్య నిపుణుల నుంచి ఈ వ్యాధిపై రోజు కో తీరుగా వస్తున్న రకరకాల, పొంతనలేని ప్రకటనలతో ప్రజలు కలవరపడుతున్నారు. మరోవైపున ఆస్పత్రులలో వైద్యం సరిగ్గా అందక, రోగులు మరణిస్తున్నారు. సరైన మందులు సమయానికి అందకపోవడంతోపాటు పలు కారణాలతో ప్రాణాలు గాలిలో కల సిపోతున్నా ప్రభుత్వం మాత్రం అలాంటింది ఏదీ లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒక్కసారి మన ఆరోగ్య మంత్రి సర్కారు దవాఖానాకు వెళ్లి అక్కడి పరిస్థితి చూసి వైద్యసేవలు ఇతర అం శాలు పరిశీలించాలి. అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ దీనిపై అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి, విస్తృత ప్రచారం చేయాలి. అలాగే ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉంచాలి. వ్యాధి వచ్చాక పెరిగే భయాల కంటే, వ్యాధి ఎవరికి వస్తుందనే భయాలు ఇప్పుడు నగరంలో అన్నిచోట్లా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇప్ప టికైనా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. - శొంఠి విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్ -
కొత్త ఏడాది తొలిరోజే స్వైన్‌ఫ్లూ కేసు నమోదు
న్యూఢిల్లీ:నగరంలో కొత్త ఏడాది తొలిరోజే స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. గత ఏడాదితో కలిపి ఈ వ్యాధిపీడితుల సంఖ్య 39కి చేరుకుంది. ఆరోగ్య శాఖ అందించిన వివరాల ప్రకారం వాయవ్య ఢిల్లీలోని బవానా ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల మహిళ కు గురువారం స్థానిక ఆస్పత్రిలో పరీక్షలు జరపగా హెచ్1ఎన్1 పాజిటివ్ అని తేలింది. సదరు మహిళ నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల కోసం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు పంపించగా హెచ్1ఎన్1 పాజిటివ్ అని తేలిందని ఆరోగ్య శాఖ అదనపు సంచాలకుడు డాక్టర్ చరణ్‌సింగ్ తెలిపారు. కాగా వరుసగా మంగళ, బుధవారాల్లో నగరంలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా... సంబంధిత అధికారులతో తాజా పరిస్థితులను సమీక్షించారు. ఇందుకు సంబంధించి ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు తగు మార్గదర్శకాలను జారీచేశారు. తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.