నల్లగొండ టౌన్ : జిల్లాలో మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం మొదలైంది. తాజాగా జిల్లా కేంద్రంలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయి చలితీవ్రత పెరిగిపోవడంతో వ్యాధి చాపకిందనీరులా వ్యాపిస్తోంది. చలికాలంలో స్వైన్‌ఫ్లూ(హెచ్1ఎన్1) వ్యాధి ఇన్‌ఫ్లూయంజా ఎ వైరస్ వల్ల గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నెల రోజులుగా హైదరాబాద్‌లో స్వైఫ్లూతో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో అనేకమంది చేరిన విషయం విదితమే. పదుల సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయి. భాగ్యనగరానికి సమీపంలో జిల్లా ఉండడంతోపాటు ఇక్కడినుంచి రోజూ వందలాది మంది అక్కడికి వెళ్లి వస్తుంటారు.
దీంతో స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య పెరిగిపోతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో పద్నాలుగు స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండు నెలల వ్యవధిలోనే ఇన్ని కేసులు నమోదు కావడం జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ఈ కేసులన్నీ పెద్దవూర, మిర్యాలగూడ, హాలియా, మర్రిగూడ, నల్లగొండ, కట్టంగూరు, త్రిపురారం మండలాల పరిధిలో నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వారందరూ గాంధీ ఆస్పత్రితోపాటు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొంది వ్యాధినుంచి విముక్తులయ్యారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ తాజాగా ఈ ఏడాది జనవరి నెలలో జిల్లా కేంద్రంలోనే రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో కలకలం రేపుతోంది. చలి కొంత తగ్గి వ్యాధి వ్యాప్తి లేదనుకుంటున్న తరుణంలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు.
వారిలో ఒకతను పాతబస్తీకి చెందినవ్యక్తికాగా, మరొకరు బీట్‌మార్కెట్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అధికారులు పేర్కొంటున్నారు. అందులో పాతబస్తీకి చెందిన వ్యక్తి గాంధీలో చికిత్స పొంది వ్యాధినుంచి విముక్తుడై వచ్చినప్పటికీ మరో వ్యక్తి మాత్రం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క స్వైన్‌ఫ్లూ మరణాలు లేవు. కానీ వ్యాధి బారిన పడుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఎవరైనా కనిపిస్తే వెంటనే వారి రక్తనమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ఐపీఎం(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటీవ్ మెడిసిన్) ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పటికే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో పది పడకలతో ప్రత్యేక స్వైన్‌ఫ్లూ వార్డును ఏర్పాటు చేశారు. పాజిటివ్ అని ఐపీఎం నివేదికలో తేలితే వెంటనే వారికి ప్రత్యేక వార్డులో చికిత్స అందించడానికి అవసరమైన మందులను కూడా అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
స్లైన్‌ఫ్లూ లక్షణాలు
దగ్గు, ముక్కుకారడం, ఆయాసం, దమ్ము రావడం, ఊపిరి పీల్చేందుకు సైతం కష్టపడడం, పిల్లి కూతలు రావడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, గొంతులో గరగర, జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు, కళ్లనుంచి నీరు కారడం, చెవినొప్పి, చెవినుంచి చీము కారడం, చిన్న పిల్లలకు నిమ్ముచేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బహిరంగ ప్రదేశాల్లో ఏటీఎంలు, తలుపుల గొళ్లాలు, మొదలైన వాటిని వాడిన తరువాత, ప్రయాణాలను చేసిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కునే వరకు ముక్కు, కళ్లు, నోటిని ముట్టుకోవద్దు. చేతులను తరచూ సబ్సుతో శుభ్రంగా కడుక్కోవాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి, ముక్కుకు అడ్డంగా చేతి రుమాలు పెట్టుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగడంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. చలికాలంలో మంచుపడుతున్న సమయంలో బయటకు వెళ్లొద్దు. ఉన్నిదుస్తులను ధరించాలి. వేడివేడి ఆహారం తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. చిన్న పిల్లల శరీర ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉన్ని దుస్తులను వేయాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేం«ద్రం డాక్టర్‌ను సంప్రదించాలి.
మందులు అందుబాటులో ఉంచాం
స్వైన్‌ఫ్లూ చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రితోపాటు దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రుల్లో మాత్రలు, టానిక్‌లను సిద్ధంగా ఉంచాం. మా సిబ్బంది, వైద్యులను అప్రమత్తం చేశాం. గ్రామస్థాయిలో స్వైన్‌ఫ్లూపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. చలికాలంలో వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. జిల్లానుంచి నిత్యం హైదరాబాద్‌కు జిల్లానుంచి అనేకమంది రాకపోకలు సాగిస్తుంటారు. కాబట్టి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అనుమానిత కేసులు నమోదైతే వెంటనే మా ప్రత్యేక వైద్యబృందం వెళ్లి వారిని పరీక్షించడంతోపాటు చుట్లూ ఉన్న 50 ఇళ్లలోని వారికి కూడా పరీక్షలను చేయడానికి ఏర్పాట్లు చేశాం. – డాక్టర్ వై.గంగవరప్రసాద్, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment