కర్ణాటక , బనశంకరి : స్మార్ట్‌ఫోన్ వచ్చాక మొబైల్ లేకుండా గంట గడపడం కూడా కష్టంగా మారింది. అయితే అదేపనిగా స్మార్ట్ ఫోన్ వినియోగించడం వల్ల మనకు తెలిసి కొన్ని, తెలియకుండా మరెన్నో నష్టాలు జరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఉంది కదా అని పాఠశాల, కళాశాలల విద్యార్థులు ఇష్టానుసారం వినియోగిస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. నిరంతరం స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తే చేతి వేళ్లకు ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో చేతిలో నుంచి పెన్ను జారిపోయే కేసులు సంఖ్య పెరిగింది. ఇటీవల నగరానికి చెందిన కొందరు విద్యార్థులు చేతి వేళ్ల సమస్యతో హాస్మట్, వివిధ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. హస్మట్ ఆస్పత్రిలో ప్రతి నెల ఐదు నుంచి ఆరు కేసులు వస్తున్నాయని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు.
దశల వారీగా పట్టు కోల్పోయే ప్రమాదం
అతిగా స్మార్ట్‌ఫోన్లు వినియోగించడం వల్ల పెన్ను పట్టుకోవడానికి సహాయపడే బొటనవేలు, ఇతరవేళ్లకు శక్తి దశలవారీగా తగ్గిపోతుంది. నిరంతరం మూడు గంటలు పరీక్ష రాయడం సాధ్యం కావడం లేదు. చేతివేళ్లకు వాపు రావడంతో దీనిని స్మార్ట్‌ఫోన్ దంబ్ అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. చేతి వేళ్లు మధ్య నొప్పి రావడం, సామర్థ్యం కోల్పోవడం, మణికట్టు శక్తిహీనతకావడం లాంటివి కనబడిన వెంటనే చేతినొప్పి రావటం లాంటి లక్షణాలు స్మార్ట్‌ఫోన్ దంబ్ సమస్య లక్షణాలు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఇలాంటి సమస్య కనబడుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయం నెలకొంది.
మెదడుపై ప్రభావం
నిరంతరం స్మార్ట్‌ఫోన్ వినియోగించడంతో మెదడుతో పాటు దేహంలోని వివిధ భాగాలపై తీవ్రప్రభావం చూపుతుందని ఇటీవల వైద్యులు, శాస్త్రవేత్తలు రుజువుచేశారు. చెవులకు దగ్గరగా మొబైల్ పెట్టుకుని మాట్లాడే సమయంలో అందులో నుంచి వచ్చే రేడియో తరంగాలు మెదడులోకి వ్యాపించడతో సామర్ధ్యం కోల్పోతారు. అదేవిధంగా మొబైల్ వినియోగం వల్ల నిద్రలేమి సమస్యకు కారణమౌతుంది. దీంతో జ్ఞాపకశక్తి తక్కువకావడం ద్వారా చదువులో వెనుకబడటంతో పాటు శారీరక కార్యకలాపాలతో పాటు విద్యార్థుల్లో స్ధూలకాయం ఏర్పడే అవకాశం ఉంది.
మొబైల్‌కు దూరంగా ఉండాలి
డిజిటల్ యుగంలో సాధనాలు ముందడగు వేసిన నేపథ్యంలో సహజంగా ఎలక్ట్రిక్ సాధనాలు, పరికరాలు తగ్గుముఖం పడతాయి. స్మార్ట్‌ఫోన్ ద్వారా పాఠ్యాంశాలను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. దీంతో అక్షర దోషాలు తలెత్తడం, రాసే సమయంలో చేతివేళ్లు సహకరించని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మొబైల్‌కు దూరం ఉంటూ పరీక్షలకు సిద్ధం కావడం చాలామంచిదని వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా నిరంతరం తల కిందకు వంచి మోబైల్ మాట్లాడటంతో గొంతునొప్పి వస్తుందని సంజయ్‌గాంధీ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ హెచ్‌ఎస్. చంద్రశేఖర్ తెలిపారు. సుదీర్ఘంగా రాయడానికి సాధ్యం కావడం లేదని ప్రతినెల 5–6 మంది ఆసుపత్రికి వస్తున్నారని నిరంతరం మొబైల్ వినియోగించడం దీనికి కారణమని పరీక్షలు సమయం సమీపిస్తున్న సమయంలో మొబైల్ వినియోగించడాన్ని తగ్గించాలని సూచించడంతో పాటు చేతి వేళ్లు నొప్పి నివారణ తగ్గిస్తున్నామని హస్‌మాట్ ఆసుపత్రి మెడికల్ డెరెక్టర్ డాక్టర్. అజిత్ బీ.రాయన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment