న్యూఢిల్లీ : కుప్వారా జిల్లా హంద్వారాలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన దురదృష్టకరమని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ ఈ విషయంపై ఇప్పటికే సంబంధిత శాఖతో మాట్లాడి, విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ముఫ్తీ హామీ ఇచ్చారు.
కాల్పులలో మృతి చెందినవారి కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని ఆమె తెలిపారు. కాగా ఓ విద్యార్థినితో ఆర్మీ జవాను అసభ్యంగా ప్రవర్తించటంతో అదికాస్తా.... హింసకు దారితీసి, ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. మరో నలుగురు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఆర్మీ కూడా విచారణకు ఆదేశించింది. పోలీసులు క్రిమనల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది.
ఇక శ్రీనగర్లో నిట్ వివాదంపై కూడా సీఎం ముఫ్తీ స్పందించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులందరికీ భద్రత కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. నిట్ విద్యార్థులంతా తమ పిల్లలే అని, వారికి రక్షణ కల్పించడం తమ బాధ్యత అన్నారు. కశ్మీర్ వారి సొంతిల్లు అని, క్యాంపస్ వదిలి వెళ్లిన స్థానికేతర విద్యార్థులు తిరిగి వస్తారని ఆశిస్తున్నామని ముఫ్తీ అభిప్రాయపడ్డారు. నిట్ లో చదువుకుంటున్న విద్యార్థులను స్థానికేతరులనే కోణంలో చూడవద్దని ఆమె సూచించారు.
కాగా టి20 వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా పరాజయాన్నినిట్లో చదువుతున్న కొందరు కాశ్మీరీ విద్యార్థులు పండగలా జరుపుకోవడాన్ని పలువురు విద్యార్థులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ వివాదం మొదలైంది. స్థానిక విద్యార్థులకు, స్థానికేతరులకు మధ్య చిచ్చు రగిలింది. అది రోజురోజుకుపెచ్చుమీరడంతో నిట్ ను శ్రీనగర్ నుండి తరలించాలని డిమాండ్ తలెత్తింది. ఈనేపథ్యంలో ముఫ్తీ మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ , మానవ వనరుల శాఖమంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. తాజాగా ఆమె ఇవాళ ఉదయం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీస్ పై ఆయనతో చర్చించారు.