అహ్మదాబాద్: గుజరాత్‌లో పటీదార్ల రిజర్వేషన్ల ఉద్యమనేత హార్దిక్ పటేల్ ఎట్టకేలకు బుధవారం కాంగ్రెస్‌కు తన మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ గెలిస్తే, ప్రస్తుత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కలిపి ఉన్న 49 శాతం కోటాకు సంబంధం లేకుండా ప్రత్యేక కేటగిరీలో పటీదార్లకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఆ పార్టీ అంగీకారం తెలిపిందన్నారు. ఈ విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరుస్తామని కాంగ్రెస్ హామీనిచ్చినట్లు హార్దిక్ చెప్పారు. కాగా, 50 శాతం ఉద్యోగాలను కచ్చితంగా జనరల్ కేటగిరీలోనే భర్తీ చేయాలనీ, 50 శాతం కన్నా ఎక్కువ పోస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు వర్తింపజేయకూడదంటూ సుప్రీంకోర్టు గతంలో పలు సందర్భాల్లో పరిమితి విధించింది.
ఈ విషయాన్ని ప్రస్తావించగా, అది సుప్రీంకోర్టు సలహా మాత్రమేననీ, ఈ నిబంధన రాజ్యాంగంలో లేదని హార్దిక్ పటేల్ పేర్కొనడం గమనార్హం. శాసనసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకు టికెట్ల విషయంలో కాంగ్రెస్‌తో తమకు ఎలాంటి విభేదాలూ లేవని స్పష్టంచేశారు. మరోవైపు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన ఇద్దరు పాస్ నేతలను తమ వర్గం నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లకు సంబంధించి చట్టంలో స్పష్టంగా ఉందనీ, 1992 నాటి సుప్రీం తీర్పు ప్రకారం 50 శాతానికి మించి ఎక్కువ పోస్టులను రిజర్వేషన్ల ద్వారా భర్తీ చేయడానికి ప్రస్తుత పరిస్థితుల్లో వీలు కానేకాదనీ కేంద్ర మంత్రి జైట్లీ అన్నారు. కాంగ్రెస్ నేతలు, హార్దిక్ ఇలాంటి మాటలతో ఒకరినొకరు మోసగించుకుంటున్నారని విమర్శించారు.
న్యాయపరమైన చిక్కులను దాటలేదు...
50 శాతానికి మించి ప్రత్యేక కోటాలో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించడం దాదాపు అసాధ్యమని పలువురు న్యాయనిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఇది జరగాలంటే, సుప్రీంకోర్టు 1992లో ఇచ్చిన తీర్పును వెనక్కు తీసుకోవాలనీ, లేదా పార్లమెంటు మూడింట రెండొంతుల మెజారిటీతో చట్టాన్ని సవరించాలని వారంటున్నారు. గుజరాత్ హైకోర్టులో పనిచేసే ఓ న్యాయవాది మాట్లాడుతూ ‘1992లో ఇచ్చిన తీర్పు సలహా మాత్రమే కాదు. అది సుప్రీంకోర్టు తీసుకొచ్చిన ఒక చట్టం. ఆ పరిమితిని మనం దాటలేం. కొత్తగా ఏ కులం వారికైనా రిజర్వేషన్లు ఇవ్వాలంటే వారిని కూడా ప్రస్తుత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో ఏదో ఓ వర్గంలో చేర్చి, ఆ 50 శాతం లోపు రిజర్వేషన్లను వర్తింపజేయడానికి మాత్రమే అవకాశం ఉంది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment