Patidar Anamat Andolan Samiti
-
మోదీ నాయకత్వంలో చిన్ని సైనికుడిలా..
గుజరాత్ యువ ఉద్యమనేత, కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ హర్ధిక్ పటేల్.. బీజేపీలో చేరే అంశంపై అధికారికంగా స్పందించాడు. ఈ మేరకు బీజేపీలో చేరుతున్న విషయాన్ని ధృవీకరిస్తూ గురువారం ఉదయం ఒక ట్వీట్ చేశాడు. దేశప్రయోజనం, రాష్ట్రప్రయోజనం, ప్రజాప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాల భావాలతో నేటి నుంచి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాను. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో.. దేశానికి సేవ చేసే గొప్ప పనిలో నేను చిన్న సైనికుడిలా పని చేస్తాను అంటూ హిందీలో ఓ ట్వీట్ చేశాడు హర్ధిక్ పటేల్. బీజేపీలో చేరే ముందు హర్ధిక్ పటేల్ పూజాకార్యక్రమాల్లో సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. పాటీదార్ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన 28 ఏళ్ల ఈ యువనేత.. 2019లో కాంగ్రెస్‌లో చేరాడు. అనంతరం, కాంగ్రెస్ అధిష్టానం పటేల్‌కు గుజరాత్ పీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగించింది. దీంతో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తేవాలని భావించిన పటేల్‌కు అనుహ్యంగా పార్టీలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. గుజరాత్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు, పార్టీ పెద్దల నుంచి సహాకారం అందకపోవడంతో పటేల్.. అధిష్టానం తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ హస్తం పార్టీకి రాజీనామా చేశారు. राष्ट्रहित, प्रदेशहित, जनहित एवं समाज हित की भावनाओं के साथ आज से नए अध्याय का प्रारंभ करने जा रहा हूँ। भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी जी के नेतृत्व में चल रहे राष्ट्र सेवा के भगीरथ कार्य में छोटा सा सिपाही बनकर काम करूँगा। — Hardik Patel (@HardikPatel_) June 2, 2022 Gujarat | Hardik Patel performs 'pooja' at his residence in Ahmedabad. He will be joining Bharatiya Janata Party today. pic.twitter.com/AqMboWjs7e — ANI (@ANI) June 2, 2022 ఇది కూడా చదవండి: 13 ఏళ్ల తర్వాత కుటుంబంతో సినిమా చూశా!.. భార్యతో అమిత్ షా సరదా వ్యాఖ్య -
జీవితంలో మూడేళ్లు వృథా
అహ్మదాబాద్: కాంగ్రెస్‌లో ఉండి తన జీవితంలో మూడేళ్లు వృథా చేసుకున్నానని గుజరాత్ పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ వాపోయారు. ఆయన బుధవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తోందని హార్దిక్ మండిపడ్డారు. గురువారం అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. గుజరాత్లో అధికార బీజేపీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ లేదా మరో రాజకీయ పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకోలేదనన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. ఆయోధ్యలో రామమందిర నిర్మాణం, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు వంటి ఘనతలు బీజేపీ సాధించిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌లో ముందుచూపు లేని నేతలు ఉన్నారని, గుజరాత్ ప్రజలపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సిద్ధాంతం.. వాడుకో, వదిలించుకో గుజరాత్లో తనను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినప్పటికీ ఏనాడూ సరైన పని అప్పగించలేదని, గౌరవం కల్పించలేదని హార్దిక్ ఆక్షేపించారు. పటీదార్ కోటా ఉద్యమంతో గుజరాత్లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంతగానో లాభపడిందన్నారు. అయినప్పటికీ కీలకపార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ కాంగ్రెస్‌లో 25 ఏళ్లుగా 7–8 మందే పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. సెకండ్ క్యాడర్ నేతలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. వాడుకో, వదిలించుకో.. ఇదే కాంగ్రెస్ సిద్ధాంతమని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు ఇప్పుడు కావాల్సింది చింతన్(మేధోమథనం) కాదు, చింత అని హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. హార్దిక్ పటేల్‌కు జైలు భయం: కాంగ్రెస్ హార్దిక్ వ్యాఖ్యలను గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ తిప్పికొట్టారు. బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే రాజీనామా పత్రం తయారు చేసుకున్నాడని విమర్శించారు. అతడిపై దేశద్రోహం కేసు నమోదయ్యిందని గుర్తుచేశారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతోనే కాంగ్రెస్‌ను వీడాడన్నారు. -
హార్దిక్ చెంప చెళ్లుమంది
అహ్మదాబాద్: కాంగ్రెస్ నేత, పటీదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఓ సభలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి హఠాత్తుగా వచ్చి ఆయన చెంప చెళ్లుమనిపించాడు. ఆ వ్యక్తిని గుజరాత్‌కు చెందిన తరుణ్ గజ్జర్‌గా గుర్తించారు. దాడి తర్వాత కాంగ్రెస్ నేతలు, పటేల్ మద్దతుదారులు అతన్ని చితకబాదగా, తీవ్ర గాయాలపాలైన అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ‘బీజేపీ నాకు హాని తలపెట్టాలని చూస్తోంది. నాపై దాడికి బీజేపీ చాలామందిని నియమించింది. అసలు ఆ వ్యక్తి నాపై ఎందుకు దాడి చేశాడో తెలీదు. అతను కచ్చితంగా బీజేపీకి చెందినవాడే. ఒక వేళ అతను తుపాకీ గానీ వెంట తెచ్చి ఉంటే నేను చనిపోయేవాన్ని’అని హార్దిక్ అన్నారు. బీజేపీ నేతలు ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సానుభూతి పొందాలనే కొత్త నాటకానికి తెరలేపిందని అన్నారు. హార్దిక్‌పై దాడికి గల కారణాలను గజ్జర్ ఆస్పత్రి బెడ్ మీద నుంచే మీడియాకు వెల్లడించాడు. ‘2015లో పటేల్ ఉద్యమ సందర్భంగా అల్లర్లు జరిగినప్పుడు నా భార్య, నా బిడ్డ అతని వల్ల ఇబ్బంది పడ్డారు. అందుకే అప్పటినుంచి ఆయనంటే నాకు కోపం’ అని గజ్జర్ అన్నాడు. -
హార్దిక్ పటేల్‌కు సుప్రీంషాక్
న్యూఢిల్లీ: పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్(25)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2015 నాటి దాడి కేసులో ఆయన దోషిత్వంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆయన ఆశలు నీరుగారినట్లే. 2015లో పటీదార్ రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా జరిగిన దాడి వెనుక హార్దిక్ ప్రోద్బలం ఉందంటూ మెహ్సనా జిల్లా పోలీసులు కేసులువేశారు. 2018లో విచారించిన విస్నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. హార్దిక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా శిక్షను కొట్టేసిన కోర్టు.. దోషిత్వాన్ని అలాగే ఉంచింది. మార్చిలో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్.. జామ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన వ్యక్తి(దోషిత్వంపై న్యాయస్థానం స్టే ఇవ్వని పరిస్థితుల్లో) ఎన్నికల్లో పోటీకి అనర్హుడు. -
మంచినీరు కూడా ముట్టను
అహ్మదాబాద్: పటీదార్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ పటీదార్ల నేత హార్దిక్ పటేల్(25) చేపట్టిన నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరుకుంది. ఇకపై మంచినీరు కూడా తాగనని ఆయన శుక్రవారం ప్రకటించారు. ఆహారం, నీరు లేకుండా దీక్షచేస్తానని, ఆశయం సిద్ధించేదాకా గాంధీజీ చూపిన బాటలో పోరు సాగిస్తానన్నారు. శుక్రవారం గుజరాత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అర్జున్ మొధ్వాడియా, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కనూ కల్సారియా సహా పలువురు నేతలు హార్దిక్‌ను కలిసి మద్దతు తెలిపారు. వేర్పాటు వాదులతో చర్చలు జరపగలిగిన ప్రభుత్వం హార్దిక్‌తో ఎందుకు చర్చలు జరపడం లేదని మొధ్వాడియా అన్నారు. హార్దిక్‌తో చర్చలు జరిపి పరిష్కారం కనుగొనాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో దీక్షకు అధికారులు నో చెప్పడంతో 25న తన నివాసంలోనే హార్దిక్ దీక్ష ప్రారంభించారు. -
కాంగ్రెస్‌కే మా మద్దతు: హార్దిక్
అహ్మదాబాద్: గుజరాత్లో పటీదార్ల రిజర్వేషన్ల ఉద్యమనేత హార్దిక్ పటేల్ ఎట్టకేలకు బుధవారం కాంగ్రెస్‌కు తన మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ గెలిస్తే, ప్రస్తుత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కలిపి ఉన్న 49 శాతం కోటాకు సంబంధం లేకుండా ప్రత్యేక కేటగిరీలో పటీదార్లకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఆ పార్టీ అంగీకారం తెలిపిందన్నారు. ఈ విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరుస్తామని కాంగ్రెస్ హామీనిచ్చినట్లు హార్దిక్ చెప్పారు. కాగా, 50 శాతం ఉద్యోగాలను కచ్చితంగా జనరల్ కేటగిరీలోనే భర్తీ చేయాలనీ, 50 శాతం కన్నా ఎక్కువ పోస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు వర్తింపజేయకూడదంటూ సుప్రీంకోర్టు గతంలో పలు సందర్భాల్లో పరిమితి విధించింది. ఈ విషయాన్ని ప్రస్తావించగా, అది సుప్రీంకోర్టు సలహా మాత్రమేననీ, ఈ నిబంధన రాజ్యాంగంలో లేదని హార్దిక్ పటేల్ పేర్కొనడం గమనార్హం. శాసనసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకు టికెట్ల విషయంలో కాంగ్రెస్‌తో తమకు ఎలాంటి విభేదాలూ లేవని స్పష్టంచేశారు. మరోవైపు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన ఇద్దరు పాస్ నేతలను తమ వర్గం నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లకు సంబంధించి చట్టంలో స్పష్టంగా ఉందనీ, 1992 నాటి సుప్రీం తీర్పు ప్రకారం 50 శాతానికి మించి ఎక్కువ పోస్టులను రిజర్వేషన్ల ద్వారా భర్తీ చేయడానికి ప్రస్తుత పరిస్థితుల్లో వీలు కానేకాదనీ కేంద్ర మంత్రి జైట్లీ అన్నారు. కాంగ్రెస్ నేతలు, హార్దిక్ ఇలాంటి మాటలతో ఒకరినొకరు మోసగించుకుంటున్నారని విమర్శించారు. న్యాయపరమైన చిక్కులను దాటలేదు... 50 శాతానికి మించి ప్రత్యేక కోటాలో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించడం దాదాపు అసాధ్యమని పలువురు న్యాయనిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఇది జరగాలంటే, సుప్రీంకోర్టు 1992లో ఇచ్చిన తీర్పును వెనక్కు తీసుకోవాలనీ, లేదా పార్లమెంటు మూడింట రెండొంతుల మెజారిటీతో చట్టాన్ని సవరించాలని వారంటున్నారు. గుజరాత్ హైకోర్టులో పనిచేసే ఓ న్యాయవాది మాట్లాడుతూ ‘1992లో ఇచ్చిన తీర్పు సలహా మాత్రమే కాదు. అది సుప్రీంకోర్టు తీసుకొచ్చిన ఒక చట్టం. ఆ పరిమితిని మనం దాటలేం. కొత్తగా ఏ కులం వారికైనా రిజర్వేషన్లు ఇవ్వాలంటే వారిని కూడా ప్రస్తుత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో ఏదో ఓ వర్గంలో చేర్చి, ఆ 50 శాతం లోపు రిజర్వేషన్లను వర్తింపజేయడానికి మాత్రమే అవకాశం ఉంది’ అని వివరించారు. -
డీల్ కుదరలేదా? అర్థరాత్రి హైడ్రామా
అహ్మదాబాద్ : గుజరాత్ ఎన్నికల్లో భాగంగా పటీదార్ అనమత్ ఆందోళన్ సమితితో పొత్తు కుదిరిందని ప్రకటన వెలువడిన కాసేపటికే పరిస్థితులు తారుమారయ్యాయి. టికెట్ల పంపిణీ చిచ్చు రాజుకుని సూరత్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పటేల్ వర్గీయులు-కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఈ క్రమంలో పార్టీ ఆఫీస్‌ను పూర్తిగా ధ్వంసం చేసేశారు. ముందుగా పటీదార్ మద్దతుదారులు పార్టీ కార్యలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. ఒకానోక క్రమంలో ఇరు వర్గాలు ఒకరినొకరిని తోసుకోవటంతో కొట్లాట మొదలైంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పటీదార్ కార్యర్తలను అరెస్ట్ చేశారు. మొత్తం 77 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అందులో కేవలం మూడు స్థానాలను మాత్రమే పటేల్ వర్గానికి కేటాయించింది. దీనికి నిరసనగానే సూరత్, అహ్మదాబాద్‌లో పీఏఏఎస్ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టింది. మరోపక్క పటీదార్ నేత దినేశ్ పటేల్ పలువురు కార్యకర్తలను వెంటపెట్టుకుని గుజరాత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భరత్సిన్హ్ సోలంకి ఇంటికి వెళ్లారు. అయితే భరత్ మాత్రం వారిని కలిసేందుకు నిరాకరించటంతో బయటే ఆందోళన చేపట్టారు. కాగా, ఘటనకు నిరసనగా నేడు కాంగ్రెస్ వ్యతిరేక పదర్శనలు నిర్వహించేందుకు పటీదార్ వర్గం సిద్ధమైంది. ‘‘కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై పునరాలోచన చేస్తాం. నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తాం. మేము వారిని(కాంగ్రెస్) అడిగేది ఒక్కటే. అధికారంలోకి వచ్చాక పటేల్ వర్గానికి ఇచ్చిన హామీలను(రిజర్వేషన్లను) ఎలా నెరవేర్చబోతున్నారు అన్నది తేల్చాలి. అప్పుడే వారి తరపున ప్రచారానికి మేము సిద్ధంగా ఉంటాం.. అని దినేశ్ పటేల్ మీడియాకు తెలిపారు. పోలీసులు కూడా తమపై దౌర్జన్యానికి తెగపడ్డారని ఆయన ఆక్షేపించారు. ఇక హార్దిక్ పటేల్ లేకుండానే ఆదివారం కాంగ్రెస్ పార్టీతో పీఏఏఎస్ కీలక సమావేశం నిర్వహించింది. అనంతరం పీఏఏఎస్ కన్వీనర్ దినేశ్ బాంభానియా మాట్లాడుతూ.. రిజర్వేషన్ల ఫార్ములాపై మాత్రమే ఒప్పందం కుదరిందని.. సీట్ల పంపకం గురించి చర్చించలేదని వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అంశాలను సోమవారం రాజ్‌కోట్ సభలో తమ అధినేత హార్దిక్ పటేల్ స్పష్టత ఇస్తారని దినేశ్ ప్రకటించారు. #WATCH Surat: Patidar Anamat Andolan Samiti workers clash with Congress workers over ticket distribution (earlier visuals) pic.twitter.com/uz5fx9oXIc — ANI (@ANI) November 20, 2017 -
కాంగ్రెస్–పటేళ్ల మధ్య సయోధ్య
అహ్మదాబాద్: గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ, పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) మధ్య రిజర్వేషన్లపై నెలకొన్న పీటముడి వీడింది. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పటేళ్లకు కల్పించే రిజర్వేషన్లపై ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరిందని పీఏఏఎస్ కన్వీనర్ దినేశ్ బాంభానియా తెలిపారు. ఈ ఒప్పందం వివరాలు, ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అంశాలను సోమవారం రాజ్‌కోట్‌లో జరిగే సభలో తమ నాయకుడు హార్దిక్ పటేల్ వెల్లడిస్తారని చెప్పారు. ఆదివారం కాంగ్రెస్, పీఏఏఎస్ల మధ్య జరిగిన సమావేశానికి హార్దిక్ పటేల్ హాజరుకాలేదు. ‘రిజర్వేషన్లపై కాంగ్రెస్‌తో కీలక సమావేశం నిర్వహించాం. అందుబాటులో ఉన్న పలు ప్రత్యామ్నాయాలపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. సోమవారం రాజ్‌కోట్‌లో జరిగే కార్యక్రమంలో హార్దిక్ పటేల్ వివరాలు వెల్లడిస్తారు. రిజర్వేషన్ల ఫార్ములాపై మాత్రమే కాంగ్రెస్‌తో అవగాహన కుదిరింది. అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ వర్గానికి టికెట్లు ఇవ్వడంపై చర్చించలేదు. కాంగ్రెస్‌కు మద్దతిస్తామా? లేదా? అన్నది హార్దిక్ చెబుతారు’అని దినేశ్ అన్నారు. కాంగ్రెస్ తొలి జాబితా విడుదల న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలకు కాంగ్రెస్ 77 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. సీనియర్ నాయకులు శక్తిసిన్హా గోహిల్, అర్జున్ మోధ్వాడియాలకు టికెట్లు దక్కాయి. మరోవైపు, ఈ ఎన్నికల్లో తాను పోటీచేయడంలేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ భరత్‌సిన్హా సోలంకి స్పష్టం చేశారు. ఈ జాబితాలో 20 మంది పటేళ్లకు చోటు కల్పించడం గమనార్హం. -
తల నరికినా బీజేపీకి మద్దతివ్వం: హార్దిక్
అహ్మదాబాద్: పటేళ్లకు రిజర్వేషన్లు ఇచ్చే అంశంలో రాజ్యాంగ భద్రత కల్పించేందుకు కాంగ్రెస్ అంగీకరించిందని పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో తాను కలిసిలేనని.. అలాగని వారికి వ్యతిరేకమూ కాదని స్పష్టం చేశారు. పటేళ్లకు వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్న అహంకారపూరిత వైఖరికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందన్నారు. అహ్మదాబాద్‌లో గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ భరత్‌సింగ్ సోలంకితో కలసి పటేల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘నేను కాంగ్రెస్‌తో కలిసి లేను. అలాగని వారికి వ్యతిరేకమూ కాదు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తా. అయితే ఓబీసీ కేటగిరీలో పటేళ్లకు ఎలా రిజర్వేషన్లు కల్పిస్తారని కాంగ్రెస్ వివరించాలి. మీరు ఆకాశం నుంచి తెస్తారా! పాతాళం నుంచి తోడుకొస్తారా! నాకు తెలీదు. నాకు రిజర్వేషన్ కావాలంతే’ అని హార్దిక్ స్పష్టం చేశారు. ‘మా డిమాండ్లను అధికార పక్షం విననప్పుడు, ప్రతిపక్షంతో మాట్లాడటం మా హక్కు. మా తలలు నరికినా, జైళ్లకు పంపినా ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీకి మద్దతివ్వం. 25 ఏళ్లు పటేళ్లు బీజేపీ వెంటే ఉన్నారు. ఇప్పడు మేం వారితో కలసి పనిచేయం’ అని చెప్పారు. -
హార్దిక్ పటేల్‌పై అరెస్ట్ వారంట్
గుజరాత్: పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్‌కు కోర్టు షాక్‌నిచ్చింది. 2015లో బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయం ధ్వంసం కేసుకు సంబంధించి రెండోసారి కూడా కోర్టుకు హజరుకాకపోవడంపై బుధవారం విస్నాగర్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హార్దిక్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో మరో ఆరుగురికి కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ సెషన్స్ కోర్టు జడ్జి వీపీ అగర్వాల్ ఉత్తర్వులిచ్చారు. హార్దిక్ తరఫు లాయర్ వాదిస్తూ.. బిజీ షెడ్యూల్ కారణంగా హార్దిక్ కోర్టుకు హాజరు కాలేకపోతున్నారని, అందువల్ల ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే కోర్టు తిరస్కరించింది. -
‘కోటి’ కలకలంపై స్పందించిన సీఎం
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో గుజరాత్లో ‘కోటి’ కలకలం రేగింది. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) నాయకుడిని తమవైపు తిప్పుకునేందుకు అధికార బీజేపీ చేసిన ప్రయత్నం బట్టబయలు కావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. బీజేపీ ఇచ్చిన డబ్బుతో పీఏఏఎస్ కన్వీనర్ నరేంద్ర పటేల్ సోమవారం మీడియాకు రావడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్పందించారు. పటీదార్ల మద్దతు బీజేపీకే ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాల్లో గెలుస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. తమపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, సీఎం విజయ్ రూపానీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భేటీ అయ్యారు. రూ. కోటి లంచం ఆరోపణలు, తాజా పరిణామాలపై చర్చించారు. తమ పార్టీలో చేరేందుకు బీజేపీ తనకు కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైందని నరేంద్ర పటేల్ తెలిపారు. ఇటీవల బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్ సన్నిహితుడు వరుణ్ పటేల్ ద్వారా తనతో బేరం కుదుర్చుకుందని ఆయన మీడియాకు వెల్లడించారు. అడ్వాన్స్‌గా తనకు రూ. 10 లక్షలు ఇచ్చారని, మిగతా రూ. 90 లక్షలు రేపు ఇస్తామని చెప్పినట్టు తెలిపారు. వరుణ్ పటేల్ ఇచ్చిన రూ. 10 లక్షల నగదును మీడియాకు చూపించారు. నరేంద్ర పటేల్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఇదంతా కాంగ్రెస్ కుట్రగా వర్ణించింది. తమ పార్టీలో చేరేందుకు ఆయనే ముందుకు వచ్చారని, రెండుమూడు గంటల తర్వాత ఈ డ్రామాకు తెరతీశారని బీజేపీ అధికార ప్రతినిధి భరత్ పాండ్యా అన్నారు. మొత్తం కోటి రూపాయలు తీసుకున్న తర్వాత మీడియాకు ముందుకు రావచ్చు కదా, ముందే ఎందుకు వచ్చారని వరుణ్ పటేల్ ప్రశ్నించారు. పటేల్ కులస్తులంతా బీజేపీ వైపు మొగ్గుచూపుతుండటంతో భయపడిపోయి కాంగ్రెస్ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తోందని ఎదురుదాడి చేశారు. -
మంత్రులను కలిసేందుకు ఢిల్లీ రాలేదు
న్యూఢిల్లీ: భవిష్యత్ ప్రణాళికను సిద్దం చేసుకునేందుకు మాత్రమే ఢిల్లీ వచ్చినట్లు పటేల్ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న హర్దిక్ పటేల్ స్పష్టం చేశారు. అంతేకాని కేంద్ర మంత్రులను కలవడానికి మాత్రం కాదని ఆయన తెలిపారు. ఆదివారం న్యూఢిల్లీలో హర్దిక్ పటేల్ విలేకర్లతో మాట్లాడారు. రిజర్వేషన్ల కోసం తాము చేపట్టిన ఆందోళనలో పాల్గొనాలని ఏ రాజకీయ పార్టీని తాము ఆహ్వానించలేదని హర్దిక్ పటేల్ చెప్పారు. పటేల్ రిజర్వేషన్ల కోసం జాట్స్, గుజర్ల మద్దతు తీసుకునేందుకు హర్దిక్ పటేల్ బృందం న్యూఢిల్లీ విచ్చేసింది. అందులో భాగంగా ఈ రోజు ఆయా సామాజిక వర్గాల నాయకులతో హర్దిక్ భేటీ కానున్నారు. అయితే నేటి మధ్యాహ్నం 1.00 గంటకు హర్దిక్ పటేల్ విలేకర్లతో మాట్లాడతారని పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) నాయకుడు దినేష్ పటేల్ వెల్లడించారు. ఢిల్లీ విచ్చేసిన హర్దిక్... ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ ఉండదని తేల్చి చెప్పారు. శుక్రవారం హర్దిక్... పోలీస్ కస్టడీలో మరణించిన శ్వేతాంగ్ పటేల్ నివాసానికి హర్దిక్ వెళ్లాడు. అక్కడ శ్వేతాంగ్ సోదరి హర్దిక్ రాకీ కట్టింది. శ్వేతనాగ్ అంత్యక్రియలు ఆదివారం బాపు నగర్లో జరగనున్నాయి. పటేల్‌లకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా శ్వేతనాగ్ పటేల్ అనే వ్యక్తి పోలీసు కస్టడీలో కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో తొమ్మిది మంది పోలీసులపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసును సీఐడీతో విచారణ జరిపించాలని కేసు నమోదు చేయాలని గుజరాత్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. -
‘నయామోదీ’ హార్దిక్ పటేల్
మధ్యతరగతి కుటుంబం * నీటి సరఫరా వ్యాపారం.. * పటేల్‌ల సంరక్షకుడిగా కీర్తి * నెలరోజుల్లో 137 ర్యాలీల నిర్వహణ అహ్మదాబాద్: రెండు నెలల క్రితం వరకూ అతనెవరో ఎవరికీ తెలియదు.. వయసు కూడా ఏమంత పెద్దది కాదు.. జస్ట్ 22 ఏళ్లు మాత్రమే.. మీసాలు కూడా లేలేతగా ఇప్పుడిప్పుడే పెరుగుతున్న వయసది. ఇప్పుడు ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌ను ఒక్క కుదుపు కుదిపాడు. లక్షలాది మందిని ఏకం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. గుజరాత్లో పటేల్ కులస్తులకు ఇప్పుడు ఈ కుర్రవాడే నాయకుడు. వారికి అతనేం చెప్తే అది వేదం. అతని పేరు హార్దిక్ పటేల్.. అతని అనుచరులు మాత్రం అతణ్ణి ‘నయా మోదీ’ అని పిలుచుకుంటారు. మరి కొందరు ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌తో పోలుస్తారు. అతని అభిమానులైతే ఏకంగా ‘పటీదార్ హృదయ సమ్రాట్’ అని బిరుదునిచ్చేశారు. మంగళవారం అహ్మదాబాద్‌లో తన పిలుపుతో జరిగిన క్రాంతి ర్యాలీతో ఒక్కసారిగా యావత్‌దేశం దృష్టిని హార్దిక్ ఆకర్షించాడు. పెద్దగా అనుభవం లేని ఈ కులనేత పిలిస్తే లక్షల సంఖ్యలో తరలి వచ్చారంటే.. మహామహా రాజకీయ నాయకులే ముక్కున వేలేసుకునే పరిస్థితి. హార్దిక్ పెద్దగా చదువు ఒంటబట్టిన వాడేమీ కాదు. అహ్మదాబాద్‌లోని సహజానంద్ కాలేజీలో బి.కాం 50 శాతం కంటే తక్కువ మార్కులతో పాసయ్యాడు. అహ్మదాబాద్ జిల్లాలోని వీరంగం పట్టణం, చంద్రాపూర్ గ్రామానికి చెందిన హార్దిక్, వీరంగంలోని వాణిజ్య భవన సముదాయాలకు నీటి సరఫరా చేసే వ్యాపారాన్ని కుటుంబ వారసత్వంగా చేస్తున్నాడు. ఇతని తండ్రి భరత్‌భాయ్ బీజేపీలో ఓ మధ్యస్థాయి కార్యకర్త. 2011లో ‘సర్దార్ పటేల్ సేవాదళ్’ పేరుతో పటేళ్ల సంరక్షణకు ఓ సంస్థను హార్దిక్ ప్రారంభించాడు. చిన్నగా ప్రారంభమైన ఈ సంస్థ కార్యక్రమాలు గత నెల జూలైలో ఏకంగా పటేళ్లకు రిజర్వేషన్ల డిమాండ్ దిశగా ఉధృత రూపం దాల్చింది. ‘పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్)’ ఏర్పాటైంది. కన్వీనర్ బాధ్యహార్దిక్. గత జూలైలో గుజరాత్లో రాజకీయంగా కీలక పాత్ర వహించే మెహసానా జిల్లాలో తొలి ర్యాలీ నిర్వహించాడు. అప్పటి నుంచి అహ్మదాబాద్‌లో హింసాత్మకంగా మారిన క్రాంతి ర్యాలీ వరకు నిర్విరామంగా 137 ర్యాలీలు గుజరాత్‌లోని మొత్తం 12 జిల్లాల్లో ఎడతెరపి లేకుండా నిర్వహించాడు. హార్దిక్ తన ఉద్యమానికి ఆలంబనగా సామాజిక మాధ్యమాన్ని విస్తృతంగా వాడుకుంటున్నాడు. ఫేస్బుక్ పేజీలో 5000 మంది ఆయన్ని అనుసరిస్తున్నారు. ఇప్పుడు ట్విటర్‌ను కూడా వినియోగిస్తున్నాడు. ఇటీవల అతను డబుల్‌బ్యారెల్ గన్ పెట్టుకుని నిల్చున్న ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేయటంతో వివాదం రేగింది. అయితే.. ఆయన అనుచర గణానికి మాత్రం ఈ ఫోటోతో హార్దిక్ సూపర్ హీరో అయ్యాడు. ఎందుకీ ఉద్యమం? దేశంలో వ్యాపార కులానికి మారుపేరైన పటేల్ కులస్తులు 30 ఏళ్ల తర్వాత మళ్లీ వీధుల్లోకి వచ్చారు. దళితులకు, ఆదివాసీలకు, ఇతర వెనుకబడిన కులస్తులకు విద్య, ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించటాన్ని వ్యతిరేకిస్తూ 1981-1985 మధ్య పటేల్ సమాజం తీవ్ర ఆందోళనలు నిర్వహించింది. ఇప్పుడు తిరిగి ఆందోళన ప్రారంభించింది. ఈసారి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాదు.. తమ తమకు రిజర్వేషన్లు కల్పించాలన్నది ప్రస్తుతం వారి ప్రధాన డిమాండ్. గుజరాత్లో పటేల్ వర్గం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాల జాబితాలో చేర్చాలన్నది వారి డిమాండ్. -
ఎవరీ హార్దిక్ పటేల్..?
రెండు నెలల క్రితం వరకు అతనెవరో ఎవరికీ తెలియదు. నేడు గుజరాత్ లో ఈ యువకుడి పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. అతనికి రాజకీయ నేపథ్యం లేదు.. కానీ గుజరాత్ రాజకీయ నేతలకు వణుకు పుట్టిస్తున్నాడు. మధ్యతరగతి కుర్రాడు కావచ్చు.. పిలుపినిస్తే లక్షలాది మంది తరలి వస్తున్నారు. చదువులో టాపర్ కాదు కానీ.. వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. ఈ కుర్రాడే హార్దిక్ పటేల్. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హార్దిక్ పేరు తెరమీదకు వచ్చింది. గుజరాత్లో పటేల్ సామాజిక వర్గానికి హార్దిక్ పటేల్ ఇప్పుడు హీరో. పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ హార్దిక్ ఉద్యమబాట పట్టాడు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే 2017 గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని హెచ్చరిస్తున్నాడు. గుజరాత్ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్న హార్దిక్ బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాడు. 21 ఏళ్ల హార్దిక్ బీకాం పట్టభద్రుడు. అహ్మదాబాద్ సమీపంలోని వీరంగామ్ అతని సొంతూరు. తండ్రి చిన్న వ్యాపారం చేస్తుంటారు. డిగ్రీ పూర్తయ్యాక తండ్రి వ్యాపారంలో చేదోడుగా ఉన్న హార్దిక్.. పటేల్ సామాజిక వర్గం కోసం ఉద్యమించాడు. పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) కన్వీనర్‌గా గుజరాత్లో ఊరూవాడా తిరుగుతూ పటేల్ సామాజిక వర్గాన్ని ఏకం చేశాడు. అతని సమావేశాలకు లక్షల్లో పటేల్ కులస్తులు హాజరవుతున్నారు. దీంతో సాఫీగా సాగిపోతున్న గుజరాత్ ప్రభుత్వానికి కొత్త సమస్య వచ్చిపడింది. ముఖ్యంగా పటేల్ సామాజికవర్గ నాయకులు ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. రాజస్థాన్‌లో గుజ్జర్ల తరహాలో గుజరాత్లో పటేల్ సామాజిక వర్గం ఆందోళన బాటపట్టింది. తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని తీవ్రం చేశారు. గుజరాత్లో ఈ రోజు బంద్ సందర్భంగా చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. చాలా ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను ఆపివేశారు. మంగళవారం రాత్రి పోలీసులు హార్దిక్‌ను నిర్బంధించారు. ఈ వార్త తెలియగానే వేలాది పటేల్ సామాజికవర్గ యువకులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో గంటలోనే అతన్ని విడుదల చేశారు. ఎలాంటి హింస జరగకుండా శాంతియుత మార్గంలో బంద్ పాటించాలని హార్దిక్ పిలుపునిచ్చాడు. అతని నాయకత్వంలో ఈ రోజు అహ్మదాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. హార్దిక్‌పై పలు విమర్శలు, ఫిర్యాదులు వచ్చినా.. సొంత సామాజికవర్గంలో హీరోగా మారిపోయాడు. 'పటేల్ కులానికి చెందిన విద్యార్థికి 90 శాతం మార్కులు వచ్చినా ఎంబీబీఎస్ కోర్సులో సీటు రావడం లేదు. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 45 శాతం మార్కులతో అడ్మిషన్ పొందుతున్నారు. మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు వ్యతిరేకం కాదు. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలన్నదే మా డిమాండ్' అన్నది హార్దిక్ వాదన. గుజరాత్లో అధికార బీజేపీకి పటేళ్లు గట్టి మద్దతుదార్లు. ఆ రాష్ట్ర జనాభాలో ఈ సామాజికవర్గం వారు 15 శాతం మంది ఉన్నారు. దీంతో బీజేపీ పటేళ్లను దూరం చేసుకునే పరిస్థితి లేదు. అయితే ఇప్పటికే రిజర్వేషన్లు 50 శాతం మించడంతో పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చడం సాధ్యంకాదని గుజరాత్ సీఎం ఆనందీబెన్ చెబుతున్నారు. ఆమె కూడా పటేల్ సామాజికవర్గానికి చెందినవారే. గుజరాత్లో రాజకీయ, వ్యాపార రంగాల్లో పటేల్ సామాజికవర్గం వారు కీలక స్థాయిలో ఉన్నారు.