అహ్మదాబాద్: గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ, పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) మధ్య రిజర్వేషన్లపై నెలకొన్న పీటముడి వీడింది. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పటేళ్లకు కల్పించే రిజర్వేషన్లపై ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరిందని పీఏఏఎస్ కన్వీనర్ దినేశ్ బాంభానియా తెలిపారు. ఈ ఒప్పందం వివరాలు, ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అంశాలను సోమవారం రాజ్‌కోట్‌లో జరిగే సభలో తమ నాయకుడు హార్దిక్ పటేల్ వెల్లడిస్తారని చెప్పారు.
ఆదివారం కాంగ్రెస్, పీఏఏఎస్‌ల మధ్య జరిగిన సమావేశానికి హార్దిక్ పటేల్ హాజరుకాలేదు. ‘రిజర్వేషన్లపై కాంగ్రెస్‌తో కీలక సమావేశం నిర్వహించాం. అందుబాటులో ఉన్న పలు ప్రత్యామ్నాయాలపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. సోమవారం రాజ్‌కోట్‌లో జరిగే కార్యక్రమంలో హార్దిక్ పటేల్ వివరాలు వెల్లడిస్తారు. రిజర్వేషన్ల ఫార్ములాపై మాత్రమే కాంగ్రెస్‌తో అవగాహన కుదిరింది. అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ వర్గానికి టికెట్లు ఇవ్వడంపై చర్చించలేదు. కాంగ్రెస్‌కు మద్దతిస్తామా? లేదా? అన్నది హార్దిక్ చెబుతారు’అని దినేశ్ అన్నారు.
కాంగ్రెస్ తొలి జాబితా విడుదల
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలకు కాంగ్రెస్ 77 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. సీనియర్ నాయకులు శక్తిసిన్హా గోహిల్, అర్జున్ మోధ్వాడియాలకు టికెట్లు దక్కాయి. మరోవైపు, ఈ ఎన్నికల్లో తాను పోటీచేయడంలేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ భరత్‌సిన్హా సోలంకి స్పష్టం చేశారు. ఈ జాబితాలో 20 మంది పటేళ్లకు చోటు కల్పించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment