మంత్రులను కలిసేందుకు ఢిల్లీ రాలేదు
న్యూఢిల్లీ: భవిష్యత్ ప్రణాళికను సిద్దం చేసుకునేందుకు మాత్రమే ఢిల్లీ వచ్చినట్లు పటేల్ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న హర్దిక్ పటేల్ స్పష్టం చేశారు. అంతేకాని కేంద్ర మంత్రులను కలవడానికి మాత్రం కాదని ఆయన తెలిపారు. ఆదివారం న్యూఢిల్లీలో హర్దిక్ పటేల్ విలేకర్లతో మాట్లాడారు. రిజర్వేషన్ల కోసం తాము చేపట్టిన ఆందోళనలో పాల్గొనాలని ఏ రాజకీయ పార్టీని తాము ఆహ్వానించలేదని హర్దిక్ పటేల్ చెప్పారు.
పటేల్ రిజర్వేషన్ల కోసం జాట్స్, గుజర్ల మద్దతు తీసుకునేందుకు హర్దిక్ పటేల్ బృందం న్యూఢిల్లీ విచ్చేసింది. అందులో భాగంగా ఈ రోజు ఆయా సామాజిక వర్గాల నాయకులతో హర్దిక్ భేటీ కానున్నారు. అయితే నేటి మధ్యాహ్నం 1.00 గంటకు హర్దిక్ పటేల్ విలేకర్లతో మాట్లాడతారని పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) నాయకుడు దినేష్ పటేల్ వెల్లడించారు. ఢిల్లీ విచ్చేసిన హర్దిక్... ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ ఉండదని తేల్చి చెప్పారు.
శుక్రవారం హర్దిక్... పోలీస్ కస్టడీలో మరణించిన శ్వేతాంగ్ పటేల్ నివాసానికి హర్దిక్ వెళ్లాడు. అక్కడ శ్వేతాంగ్ సోదరి హర్దిక్ రాకీ కట్టింది. శ్వేతనాగ్ అంత్యక్రియలు ఆదివారం బాపు నగర్లో జరగనున్నాయి. పటేల్లకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా శ్వేతనాగ్ పటేల్ అనే వ్యక్తి పోలీసు కస్టడీలో కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో తొమ్మిది మంది పోలీసులపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసును సీఐడీతో విచారణ జరిపించాలని కేసు నమోదు చేయాలని గుజరాత్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది.