న్యూఢిల్లీ: పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్(25)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2015 నాటి దాడి కేసులో ఆయన దోషిత్వంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆయన ఆశలు నీరుగారినట్లే. 2015లో పటీదార్ రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా జరిగిన దాడి వెనుక హార్దిక్ ప్రోద్బలం ఉందంటూ మెహ్‌సనా జిల్లా పోలీసులు కేసులువేశారు. 2018లో విచారించిన విస్‌నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. హార్దిక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా శిక్షను కొట్టేసిన కోర్టు.. దోషిత్వాన్ని అలాగే ఉంచింది. మార్చిలో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్.. జామ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన వ్యక్తి(దోషిత్వంపై న్యాయస్థానం స్టే ఇవ్వని పరిస్థితుల్లో) ఎన్నికల్లో పోటీకి అనర్హుడు.
Comments
Please login to add a commentAdd a comment