‘నయామోదీ’ హార్దిక్ పటేల్
మధ్యతరగతి కుటుంబం
* నీటి సరఫరా వ్యాపారం..
* పటేల్‌ల సంరక్షకుడిగా కీర్తి
* నెలరోజుల్లో 137 ర్యాలీల నిర్వహణ
అహ్మదాబాద్: రెండు నెలల క్రితం వరకూ అతనెవరో ఎవరికీ తెలియదు.. వయసు కూడా ఏమంత పెద్దది కాదు.. జస్ట్ 22 ఏళ్లు మాత్రమే.. మీసాలు కూడా లేలేతగా ఇప్పుడిప్పుడే పెరుగుతున్న వయసది. ఇప్పుడు ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌ను ఒక్క కుదుపు కుదిపాడు.
లక్షలాది మందిని ఏకం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. గుజరాత్‌లో పటేల్ కులస్తులకు ఇప్పుడు ఈ కుర్రవాడే నాయకుడు. వారికి అతనేం చెప్తే అది వేదం. అతని పేరు హార్దిక్ పటేల్.. అతని అనుచరులు మాత్రం అతణ్ణి ‘నయా మోదీ’ అని పిలుచుకుంటారు. మరి కొందరు ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌తో పోలుస్తారు. అతని అభిమానులైతే ఏకంగా ‘పటీదార్ హృదయ సమ్రాట్’ అని బిరుదునిచ్చేశారు.
మంగళవారం అహ్మదాబాద్‌లో తన పిలుపుతో జరిగిన క్రాంతి ర్యాలీతో ఒక్కసారిగా యావత్‌దేశం దృష్టిని హార్దిక్ ఆకర్షించాడు. పెద్దగా అనుభవం లేని ఈ కులనేత పిలిస్తే లక్షల సంఖ్యలో తరలి వచ్చారంటే.. మహామహా రాజకీయ నాయకులే ముక్కున వేలేసుకునే పరిస్థితి. హార్దిక్ పెద్దగా చదువు ఒంటబట్టిన వాడేమీ కాదు. అహ్మదాబాద్‌లోని సహజానంద్ కాలేజీలో బి.కాం 50 శాతం కంటే తక్కువ మార్కులతో పాసయ్యాడు.
అహ్మదాబాద్ జిల్లాలోని వీరంగం పట్టణం, చంద్రాపూర్ గ్రామానికి చెందిన హార్దిక్, వీరంగంలోని వాణిజ్య భవన సముదాయాలకు నీటి సరఫరా చేసే వ్యాపారాన్ని కుటుంబ వారసత్వంగా చేస్తున్నాడు. ఇతని తండ్రి భరత్‌భాయ్ బీజేపీలో ఓ మధ్యస్థాయి కార్యకర్త. 2011లో ‘సర్దార్ పటేల్ సేవాదళ్’ పేరుతో పటేళ్ల సంరక్షణకు ఓ సంస్థను హార్దిక్ ప్రారంభించాడు. చిన్నగా ప్రారంభమైన ఈ సంస్థ కార్యక్రమాలు గత నెల జూలైలో ఏకంగా పటేళ్లకు రిజర్వేషన్ల డిమాండ్ దిశగా ఉధృత రూపం దాల్చింది. ‘పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్)’ ఏర్పాటైంది. కన్వీనర్ బాధ్యహార్దిక్.
గత జూలైలో గుజరాత్‌లో రాజకీయంగా కీలక పాత్ర వహించే మెహసానా జిల్లాలో తొలి ర్యాలీ నిర్వహించాడు. అప్పటి నుంచి అహ్మదాబాద్‌లో హింసాత్మకంగా మారిన క్రాంతి ర్యాలీ వరకు నిర్విరామంగా 137 ర్యాలీలు గుజరాత్‌లోని మొత్తం 12 జిల్లాల్లో ఎడతెరపి లేకుండా నిర్వహించాడు. హార్దిక్ తన ఉద్యమానికి ఆలంబనగా సామాజిక మాధ్యమాన్ని విస్తృతంగా వాడుకుంటున్నాడు. ఫేస్‌బుక్ పేజీలో 5000 మంది ఆయన్ని అనుసరిస్తున్నారు. ఇప్పుడు ట్విటర్‌ను కూడా వినియోగిస్తున్నాడు. ఇటీవల అతను డబుల్‌బ్యారెల్ గన్ పెట్టుకుని నిల్చున్న ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయటంతో వివాదం రేగింది. అయితే.. ఆయన అనుచర గణానికి మాత్రం ఈ ఫోటోతో హార్దిక్ సూపర్ హీరో అయ్యాడు.
ఎందుకీ ఉద్యమం?
దేశంలో వ్యాపార కులానికి మారుపేరైన పటేల్ కులస్తులు 30 ఏళ్ల తర్వాత మళ్లీ వీధుల్లోకి వచ్చారు. దళితులకు, ఆదివాసీలకు, ఇతర వెనుకబడిన కులస్తులకు విద్య, ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించటాన్ని వ్యతిరేకిస్తూ 1981-1985 మధ్య పటేల్ సమాజం తీవ్ర ఆందోళనలు నిర్వహించింది. ఇప్పుడు తిరిగి ఆందోళన ప్రారంభించింది. ఈసారి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాదు.. తమ తమకు రిజర్వేషన్లు కల్పించాలన్నది ప్రస్తుతం వారి ప్రధాన డిమాండ్. గుజరాత్‌లో పటేల్ వర్గం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాల జాబితాలో చేర్చాలన్నది వారి డిమాండ్.