OBC reservations demand
-
ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: విజయ సాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న నేపథ్యంలో పార్లమెంటు, అసెంబ్లీలో రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ్‌సాయి రెడ్డి గురువారం రాజ్యసభలో ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో మరో పదేళ్ల రిజర్వేషన్ల పొడగింపుపై 126వ ఆర్టికల్ సవరణ బిల్లుపై రాజ్యసభలో ఇవాళ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని గతంలో తాను ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కల్పించాలని అసెంబ్లీ తీర్మానం కూడా చేశారని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. అలాగే 70 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ స్థితిగతులు మారలేదని, దేశాన్ని 50 ఏళ్లుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీల పేరుతో నినాదాలు ఇవ్వడం తప్ప వారి అభివృద్ది కోసం చేసిందేమి లేదని, రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అని తెలిపారు. అసెంబ్లీలో 225 సీట్లు పెంచాలని ఏపీ విభజన చట్టం చెబుతోందని, ఆ దిశగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సి ఉందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. -
‘నయామోదీ’ హార్దిక్ పటేల్
మధ్యతరగతి కుటుంబం * నీటి సరఫరా వ్యాపారం.. * పటేల్‌ల సంరక్షకుడిగా కీర్తి * నెలరోజుల్లో 137 ర్యాలీల నిర్వహణ అహ్మదాబాద్: రెండు నెలల క్రితం వరకూ అతనెవరో ఎవరికీ తెలియదు.. వయసు కూడా ఏమంత పెద్దది కాదు.. జస్ట్ 22 ఏళ్లు మాత్రమే.. మీసాలు కూడా లేలేతగా ఇప్పుడిప్పుడే పెరుగుతున్న వయసది. ఇప్పుడు ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌ను ఒక్క కుదుపు కుదిపాడు. లక్షలాది మందిని ఏకం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. గుజరాత్లో పటేల్ కులస్తులకు ఇప్పుడు ఈ కుర్రవాడే నాయకుడు. వారికి అతనేం చెప్తే అది వేదం. అతని పేరు హార్దిక్ పటేల్.. అతని అనుచరులు మాత్రం అతణ్ణి ‘నయా మోదీ’ అని పిలుచుకుంటారు. మరి కొందరు ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌తో పోలుస్తారు. అతని అభిమానులైతే ఏకంగా ‘పటీదార్ హృదయ సమ్రాట్’ అని బిరుదునిచ్చేశారు. మంగళవారం అహ్మదాబాద్‌లో తన పిలుపుతో జరిగిన క్రాంతి ర్యాలీతో ఒక్కసారిగా యావత్‌దేశం దృష్టిని హార్దిక్ ఆకర్షించాడు. పెద్దగా అనుభవం లేని ఈ కులనేత పిలిస్తే లక్షల సంఖ్యలో తరలి వచ్చారంటే.. మహామహా రాజకీయ నాయకులే ముక్కున వేలేసుకునే పరిస్థితి. హార్దిక్ పెద్దగా చదువు ఒంటబట్టిన వాడేమీ కాదు. అహ్మదాబాద్‌లోని సహజానంద్ కాలేజీలో బి.కాం 50 శాతం కంటే తక్కువ మార్కులతో పాసయ్యాడు. అహ్మదాబాద్ జిల్లాలోని వీరంగం పట్టణం, చంద్రాపూర్ గ్రామానికి చెందిన హార్దిక్, వీరంగంలోని వాణిజ్య భవన సముదాయాలకు నీటి సరఫరా చేసే వ్యాపారాన్ని కుటుంబ వారసత్వంగా చేస్తున్నాడు. ఇతని తండ్రి భరత్‌భాయ్ బీజేపీలో ఓ మధ్యస్థాయి కార్యకర్త. 2011లో ‘సర్దార్ పటేల్ సేవాదళ్’ పేరుతో పటేళ్ల సంరక్షణకు ఓ సంస్థను హార్దిక్ ప్రారంభించాడు. చిన్నగా ప్రారంభమైన ఈ సంస్థ కార్యక్రమాలు గత నెల జూలైలో ఏకంగా పటేళ్లకు రిజర్వేషన్ల డిమాండ్ దిశగా ఉధృత రూపం దాల్చింది. ‘పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్)’ ఏర్పాటైంది. కన్వీనర్ బాధ్యహార్దిక్. గత జూలైలో గుజరాత్లో రాజకీయంగా కీలక పాత్ర వహించే మెహసానా జిల్లాలో తొలి ర్యాలీ నిర్వహించాడు. అప్పటి నుంచి అహ్మదాబాద్‌లో హింసాత్మకంగా మారిన క్రాంతి ర్యాలీ వరకు నిర్విరామంగా 137 ర్యాలీలు గుజరాత్‌లోని మొత్తం 12 జిల్లాల్లో ఎడతెరపి లేకుండా నిర్వహించాడు. హార్దిక్ తన ఉద్యమానికి ఆలంబనగా సామాజిక మాధ్యమాన్ని విస్తృతంగా వాడుకుంటున్నాడు. ఫేస్బుక్ పేజీలో 5000 మంది ఆయన్ని అనుసరిస్తున్నారు. ఇప్పుడు ట్విటర్‌ను కూడా వినియోగిస్తున్నాడు. ఇటీవల అతను డబుల్‌బ్యారెల్ గన్ పెట్టుకుని నిల్చున్న ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేయటంతో వివాదం రేగింది. అయితే.. ఆయన అనుచర గణానికి మాత్రం ఈ ఫోటోతో హార్దిక్ సూపర్ హీరో అయ్యాడు. ఎందుకీ ఉద్యమం? దేశంలో వ్యాపార కులానికి మారుపేరైన పటేల్ కులస్తులు 30 ఏళ్ల తర్వాత మళ్లీ వీధుల్లోకి వచ్చారు. దళితులకు, ఆదివాసీలకు, ఇతర వెనుకబడిన కులస్తులకు విద్య, ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించటాన్ని వ్యతిరేకిస్తూ 1981-1985 మధ్య పటేల్ సమాజం తీవ్ర ఆందోళనలు నిర్వహించింది. ఇప్పుడు తిరిగి ఆందోళన ప్రారంభించింది. ఈసారి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాదు.. తమ తమకు రిజర్వేషన్లు కల్పించాలన్నది ప్రస్తుతం వారి ప్రధాన డిమాండ్. గుజరాత్లో పటేల్ వర్గం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాల జాబితాలో చేర్చాలన్నది వారి డిమాండ్. -
ఎవరీ హార్దిక్ పటేల్..?
రెండు నెలల క్రితం వరకు అతనెవరో ఎవరికీ తెలియదు. నేడు గుజరాత్ లో ఈ యువకుడి పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. అతనికి రాజకీయ నేపథ్యం లేదు.. కానీ గుజరాత్ రాజకీయ నేతలకు వణుకు పుట్టిస్తున్నాడు. మధ్యతరగతి కుర్రాడు కావచ్చు.. పిలుపినిస్తే లక్షలాది మంది తరలి వస్తున్నారు. చదువులో టాపర్ కాదు కానీ.. వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. ఈ కుర్రాడే హార్దిక్ పటేల్. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హార్దిక్ పేరు తెరమీదకు వచ్చింది. గుజరాత్లో పటేల్ సామాజిక వర్గానికి హార్దిక్ పటేల్ ఇప్పుడు హీరో. పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ హార్దిక్ ఉద్యమబాట పట్టాడు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే 2017 గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని హెచ్చరిస్తున్నాడు. గుజరాత్ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్న హార్దిక్ బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాడు. 21 ఏళ్ల హార్దిక్ బీకాం పట్టభద్రుడు. అహ్మదాబాద్ సమీపంలోని వీరంగామ్ అతని సొంతూరు. తండ్రి చిన్న వ్యాపారం చేస్తుంటారు. డిగ్రీ పూర్తయ్యాక తండ్రి వ్యాపారంలో చేదోడుగా ఉన్న హార్దిక్.. పటేల్ సామాజిక వర్గం కోసం ఉద్యమించాడు. పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) కన్వీనర్‌గా గుజరాత్లో ఊరూవాడా తిరుగుతూ పటేల్ సామాజిక వర్గాన్ని ఏకం చేశాడు. అతని సమావేశాలకు లక్షల్లో పటేల్ కులస్తులు హాజరవుతున్నారు. దీంతో సాఫీగా సాగిపోతున్న గుజరాత్ ప్రభుత్వానికి కొత్త సమస్య వచ్చిపడింది. ముఖ్యంగా పటేల్ సామాజికవర్గ నాయకులు ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. రాజస్థాన్‌లో గుజ్జర్ల తరహాలో గుజరాత్లో పటేల్ సామాజిక వర్గం ఆందోళన బాటపట్టింది. తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని తీవ్రం చేశారు. గుజరాత్లో ఈ రోజు బంద్ సందర్భంగా చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. చాలా ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను ఆపివేశారు. మంగళవారం రాత్రి పోలీసులు హార్దిక్‌ను నిర్బంధించారు. ఈ వార్త తెలియగానే వేలాది పటేల్ సామాజికవర్గ యువకులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో గంటలోనే అతన్ని విడుదల చేశారు. ఎలాంటి హింస జరగకుండా శాంతియుత మార్గంలో బంద్ పాటించాలని హార్దిక్ పిలుపునిచ్చాడు. అతని నాయకత్వంలో ఈ రోజు అహ్మదాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. హార్దిక్‌పై పలు విమర్శలు, ఫిర్యాదులు వచ్చినా.. సొంత సామాజికవర్గంలో హీరోగా మారిపోయాడు. 'పటేల్ కులానికి చెందిన విద్యార్థికి 90 శాతం మార్కులు వచ్చినా ఎంబీబీఎస్ కోర్సులో సీటు రావడం లేదు. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 45 శాతం మార్కులతో అడ్మిషన్ పొందుతున్నారు. మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు వ్యతిరేకం కాదు. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలన్నదే మా డిమాండ్' అన్నది హార్దిక్ వాదన. గుజరాత్లో అధికార బీజేపీకి పటేళ్లు గట్టి మద్దతుదార్లు. ఆ రాష్ట్ర జనాభాలో ఈ సామాజికవర్గం వారు 15 శాతం మంది ఉన్నారు. దీంతో బీజేపీ పటేళ్లను దూరం చేసుకునే పరిస్థితి లేదు. అయితే ఇప్పటికే రిజర్వేషన్లు 50 శాతం మించడంతో పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చడం సాధ్యంకాదని గుజరాత్ సీఎం ఆనందీబెన్ చెబుతున్నారు. ఆమె కూడా పటేల్ సామాజికవర్గానికి చెందినవారే. గుజరాత్లో రాజకీయ, వ్యాపార రంగాల్లో పటేల్ సామాజికవర్గం వారు కీలక స్థాయిలో ఉన్నారు.