కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీ 32వ వార్షిక సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు, ఏపీ మంత్రి దేవినేని ఉమ తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ : గోదావరి బేసిన్‌లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటిని కేటాయించిన తర్వాత మిగిలిన అదనపు నీటిని గోదావరి–కావేరి అను సంధానం ద్వారా కావేరి బేసిన్‌కు తరలిస్తే తమకు అభ్యంతరం లేదని కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) 32వ వార్షిక సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గోదావరి–కావేరి నదుల అనుంసంధానానికి సంబంధించి డీపీఆర్‌ను తయారు చేసే ముందు తెలంగాణ నీటి అవసరాలు తీర్చాలని కోరా రు. గోదావరి బేసిన్‌లో తెలంగాణకు హక్కుగా 954 టీఎంసీల నీరు రావాల్సి ఉందన్నారు. ముందుగా బేసిన్‌లో నీటి లభ్యతను లెక్కగట్టాలని, అనంతరం తెలంగాణ అవసరాలు, కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు తుది కేటాయింపుల తర్వాత అదనంగా మిగిలే నీటిని కావేరి బేసిన్‌కు తరలిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. నది పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అవసరాలను కేంద్రం ముందుగా పరిగణనలోకి తీసుకుని నీటి లెక్కలు తేల్చాలని కోరారు.
‘సీతారామ’కు అనుమతులివ్వండి
గోదావరి–కావేరి అనుసంధానానికి ముందు గోదా వరి బేసిన్‌లో తెలంగాణ చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు అనుమతులివ్వాలని గడ్కరీని హరీశ్ కోరారు. బేసిన్‌లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేంద్రం వేగంగా అనుమతులివ్వకుండా నదుల అనుసంధానికి డీపీఆర్‌లు తయారు చేయడం సరికాదని పేర్కొన్నారు.
కాళేశ్వరానికి నిధులివ్వండి
రాష్ట్రాలు నిర్మించే సాగునీటి ప్రాజెక్టులకు 60:40 శాతం నిధులు ఇస్తామని కేంద్రం చెప్పిందని.. ఆ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులివ్వాలని హరీశ్‌రావు కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల కీలక అనుమతులు వచ్చాయని గుర్తు చేశారు. కాళేశ్వరానికి కేంద్రం తన వాటా నిధులివ్వాలన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని ప్రాజెక్టుల వద్ద ఇంజనీర్లు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. 45 వేల క్యూసెక్యుల సామర్థ్యం కలిగిన సాత్నాల ప్రాజెక్టుకు 75 వేల క్యూసెక్కుల వరద వచ్చిందని, ఇంజనీర్లు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పిందన్నారు. పిడుగు పడటంవల్ల ప్రాజెక్టు మోటార్లు కాలిపోవడంతో గేట్లు ఎత్తలేని పరిస్థితి ఏర్పడిందని, స్థానికుల సాయంతో మాన్యువల్‌గా గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశామన్నారు. సుమారు 8 వేల మందిని కాపాడగలిగామని తెలిపారు.
రీజనల్ రింగ్ రోడ్డుకు సహకరించండి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, భవిష్యత్ అవసరాల కోసం ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్)కు సాయం చేయాలని గడ్కరీని మంత్రి హరీశ్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్ కోరారు. సమావేశం సందర్భంగా గడ్కరీకి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఆర్‌ఆర్‌ఆర్ ప్రాధాన్యాన్ని వివరించారు. రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 12 వేల కోట్లతో ప్రతిపాదనలు పంపిందని, దీనిపై సానుకూల నిర్ణయం తీసుకొని ప్రాజెక్టుకు అనుమతులతో పాటు నిధులు విడుదల చేయాలని కోరారు. 2018–19 ఏడాదికి గానూ సెంట్రల్ రోడ్ ఫండ్ కింద తెలంగాణకు రూ. 800 కోట్లు విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని సమావేశం అనంతరం మీడియాకు వినోద్ తెలిపారు. కేంద్రం ఏటా రూ. 400 కోట్లే విడుదల చేసేదని, రోడ్ల అభివృద్ధిలో రాష్ట్రం మెరుగైన పనితీరు కనబరుస్తుండటంతో మరో రూ. 400 కోట్లు సాధించగలిగామన్నారు. 31 జిల్లాల్లో 53 ప్రధాన రోడ్ల అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరిగిన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంతాప సభలో వినోద్ పాల్గొన్నారు.
గడ్కరీతో హరీశ్ భేటీ
ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి గడ్కరీని రాత్రి ఆయన నివాసంలో మంత్రి హరీశ్, ఎంపీ వినోద్ కలిశారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, వాటికి విడుదల కావాల్సిన కేంద్ర వాటాపై చర్చించారు. నీతి ఆయోగ్ యాస్పిరేషన్ డిస్ట్రిక్స్ కింద దేశవ్యాప్తంగా పలు జిల్లాలను ఎంపిక చేసి ఉపరితల చిన్న తరహా సాగునీటి పథకాలు, ఆర్‌ఆర్‌ఆర్ పథకాలు కేంద్రం అమలు చేస్తోందని.. ఇందులో తెలంగాణలోని 3 జిల్లాలనే ఎంపిక చేశారని, మరిన్ని జిల్లాలను చేర్చాలని కోరారు. రాష్ట్రం చాలా వరకు భూగర్భ జలాలు అడుగంటాయని, కాబట్టి సమర్థ భూగర్భ జలాల నిర్వహణకుగాను తెలంగాణను అటల్ భూజల్ యోజన కింద చేర్చాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment