కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా ఇవ్వండి
కేంద్రాన్ని కోరిన మంత్రి హరీశ్ రావు
కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతితో భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతిని ఢిల్లీలోని ఆమె కార్యాలయంలో సోమవారం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ ప్రాజెక్టుల గురించి బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునళ్ల ముందు ప్రస్తావించలేదు. ఇప్పుడు ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్రాలకు కొత్తగా కేటాయింపులు జరపాలని కేంద్ర మంత్రిని కోరాం. ఆమె సానుకూలంగా స్పందించారు’ అని హరీశ్ తెలిపారు.
ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కూడా కోరగా అత్యున్నత స్థాయి సమావేశాన్ని త్వరలోనే నిర్వహిస్తామని ఆమె చెప్పారన్నారు. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం(ఏఐబీపీ) కింద చొక్కారావు-దేవాదుల ప్రాజెక్టుకు విడుదల కావాల్సిన నిధుల అంశాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అనంతరం కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు చైర్మన్‌గా ఉన్న సీడబ్ల్యూసీ చైర్మన్ అశ్విన్ పాండ్యాను, గోదావరి జలాల నిర్వహణ బోర్డు చైర్మన్ మహేంద్రన్‌ను లిశారు. దేవాదుల, కల్వకుర్తి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల విషయంలో సానుకూల చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను హరీశ్ కోరారు. తెలంగాణను అన్ని రకాలుగా ఆదుకుంటామని జవదేకర్ హామీ ఇచ్చినట్టు భేటీ అనంతరం ఆయన మీడియాకు తెలిపారు.