హరియాణా ‘నిర్భయ’ దోషులకు ఉరి
♦ ఫిబ్రవరిలో మానసిక వికలాంగురాలిపై హత్యాచారం
♦ పది నెలల్లో దర్యాప్తు,విచారణ పూర్తి
♦ ఏడుగురికి మరణశిక్ష; మైనర్‌పై జేజేబీ విచారణ
రోహ్‌తక్(హరియాణా): నేపాల్‌కు చెందిన 28 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై పాశవిక హత్యాచారానికి పాల్పడిన ఏడుగురికి హరి యాణాలోని రోహ్‌తక్ అదనపు సెషన్స్ కోర్టు మరణశిక్ష విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. ఈ గ్యాంగ్ రేప్, హత్యలో పాలు పంచుకున్న మైనర్‌పై జువైనల్ జస్టిస్ బోర్డ్ విచారణ జరుపుతోంది. మరో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గద్దిఖేరి గ్రామంలో అక్క, బావల్తో నివసిస్తున్న నేపాల్‌కు చెందిన మానసిక వికలాంగురాలిని అదేగ్రామానికి చెందిన 9 మంది ఈ సంవత్సరం ఫిబ్రవరి 1న అపహరించి, పాశవికంగా అత్యాచారం జరిపి, అనంతరం హత్య చేసి, మృతదేహాన్ని రోహ్‌తక్-హిస్సార్ హైవే పక్కన ఉన్న పొలాల్లో పడేశారు.
మృతదేహంపై, మర్మావయవాలపై దారుణమైన గాయాలున్నట్లు, శరీరంలో రాళ్లు, బ్లేడ్లు ఉన్న ట్లు పోస్ట్‌మార్టంలో తేలింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం లేవడంతో.. హరియాణా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పా టు చేసింది. పది నెలల్లోనే దర్యాప్తును, విచారణను ముగించి, తీర్పు ప్రకటించడం ఈ కేసు లో విశేషం. నిందితులు రాజేశ్, పవన్, ప్రమోద్, బిల్లు, మన్బీర్, మాడా, సునీల్‌లను గతవారం దోషులుగా నిర్ధారించిన జిల్లా అదనపు సెషన్స్‌కోర్టు న్యాయమూర్తి సీమా సింఘాల్ సోమవారం వారికి వివిధ సెక్షన్ల కింద ఉరిశిక్షతో పాటు ఇతర శిక్షలు, జరిమానా విధించారు. ఈ తీర్పును హైకోర్టు ధ్రువీకరించాల్సి ఉంది.
తీర్పు ప్రకటిస్తూ న్యాయమూర్తి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇలాంటినేరాలు పాల్పడినవారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి. వీరికి క్షమాభిక్ష, శిక్ష తగ్గింపు, పెరోల్ మొదలైనవేవీ ఇవ్వొద్దు. నేను న్యాయమూర్తినే కాదు మనిషిని కూడా.. పురుషుల చేతిలో చిత్రహింసలకు గురయ్యే మహిళల ఆక్రందనలు వినగలను. మహిళలు బలహీనులు కాదన్న సందేశాన్ని సమాజానికి పంపాల్సిన తక్షణావసరం ఉంది. రేప్ బాధితులకు నిర్భయ, దామిని లాంటి వేరే పేర్లు అవసరం లేదు. ఇంకెన్నిసార్లు నిర్భయ చనిపోవాలి?’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు ‘నిర్భయ’ కేసులోని బాలనేరస్తుడు కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి ఆదివారం విడుదల కావడంపె దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సమయంలోనే ఈ తీర్పు వెలువడటం గమనార్హం.