తిరువనంతపురం: రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎల్డీఎఫ్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలతో కేరళ అట్టుడుకుతోంది. కేరళ రాజధాని తిరువనంతపురం శనివారం నిర్మానుష్యంగా మారింది. కెఎస్ ఆర్టీసీ బస్సులను ఎక్కడిక్కడ నిలిపి వేశారు. కోలం తదితర ఏరియాల్లో బస్సులపై రాళ్లు రువ్విన ఘటనలో ఓ బస్సు డ్రైవర్ గాయపడ్డాడు. మరోవైపు వైద్య సేవలు కూడా స్థంభించాయి. కొచ్చి, ఖాజీకోడ్ తదితర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమిళనాడునుండి వస్తున్న ఒక ప్రయివేటు వాహనం, విద్యార్థులతో వెళుతున్న ఓ టూరిస్టు వాహనం పై రాళ్లు రువ్వినట్టు తెలుస్తోంది. భద్రతా దళాలు, పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
అధికార, విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనతో కేరళ గత రెండురోజులు అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఎవరికి వారు సయమనం పాటించకుండా విధ్వంసం సృష్టించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో అస్వస్థతకు గురైన పలువురు సభ్యులు ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చివరికి భద్రతా సిబ్బంది రంగంలోకి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. దీనికి నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు ఎల్డీ ఎఫ్ ప్రకటించింది. ఇది ఇలా ఉంటే.. ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి ఊమెను చాందీ సోమవారం బ్లాక్ డేగా పాటిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.