చెప్పేందుకే నీతులు...కొనేది లగ్జరీ కార్లు
చండీగఢ్: గత జూలై నెలలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో నగరంలో పర్యటించి పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కడమే కాకుండా ‘నిరాడంబరుడు’గాప్రజల నుంచి నీరాజనాలు అందుకున్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పేటందుకే నీతులని నిరూపించుకున్నారు. తాను నిరాడంబర జీవితాన్నే కోరుకుంటున్నానని, ప్రజలందరు కూడా అలా ఉండేందుకే ప్రయత్నించాలని ఉద్బోధించిన ఆయన నేడు తన మంత్రివర్గ సహచరుల కోసం ఖరీదైన లగ్జరీ కార్లను కొన్నారు.
దాదాపు రెండు కోట్ల రూపాయలను వెచ్చించి నాలుగు టయోట ఫార్చున్ కార్లను, నాలుగు హోండా సీవీఆర్ కార్లను కొనుగోలు చేశారు. 24 లక్షల రూపాయల చొప్పున ఫార్చునర్ కార్లను, 23.7 లక్షల చొప్పున హోండా సీవీర్ కార్లను కొనుగోలు చేశారు. మిగతా మంత్రులందరికి కూడా త్వరలో లగ్జరీ కార్లను కొంటానని కూడా ప్రకటించారు. ఆయన మంత్రి వర్గంలో మొత్తం 17 మంది ఉన్నారు. ఎనిమిది కార్లను కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి ఖట్టర్ బుధవారం నాడు స్వయంగా ధ్రువీకరించారు. పాతపడిన కార్ల స్థానంలోనే కొత్త కార్లను కొన్నామని కూడా సమర్థించుకున్నారు.
2012లోనే మంత్రుల కోసం అప్పటి భూపేందర్ సింగ్ హూడా 3.2 కోట్ల రూపాయలను వెచ్చించి హోండా సీఆర్‌వీ కార్లను కొన్నారు. ఆ కార్లు మూడేళ్లకే ఎలా పాతపడతాయని ప్రతిపక్ష కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. అధికారులు ఎక్కడ అలుగుతారనుకున్నారేమో వారికి హోండా సిటీ కార్లను కొనేందుకు వీలుగా నిధులు మంజూరు చేశారు. ఇది ఖట్టర్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం కాదా?