ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న సీఎం.. పర్యటన వాయిదా
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా గుర్‌గావ్ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయారట. గత గురువారం దాదాపు 12 గంటలకు పైగా వేలాదిమంది ప్రయాణికులు గుర్‌గావ్ నుంచి ఢిల్లీకి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. అలాంటి జామ్ పరిస్థితే మళ్లీ ఏర్పడింది. హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అందులో చిక్కుకున్నారు. ఢిల్లీ-గుర్‌గావ్-జైపూర్ మార్గంలోని ౮వ నెంబరు జాతీయ రహదారిపై రాజోకరి ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా జామ్ అవడంతో ఆయన తన ఢిల్లీ ప్రయాణాన్ని రద్దుచేసుకుని వెనుదిరగాల్సి వచ్చింది.
న్యూఢిల్లీలోని కోపర్నికస్ మార్గ్ ప్రాంతంలో గల హర్యానా భవన్‌కు సీఎం వెళ్లాల్సి ఉంది. అయితే గుర్‌గావ్ సహా జాతీయ రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. కశ్మీర్ గేట్, ఘాజీపూర్, ధౌలా కౌన్, ఢిల్లీ-హరియాణా సరిహద్దు ప్రాంతాల్లో భారీగా గ్రాఫిక్ జామ్ అయింది. రాజోకరి ప్రాంతం దేశ రాజధానిలోకి రావడానికి ఉన్న కీలక జంక్షన్లలో ఒకటి. గత గురువారం ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ఢిల్లీ, హరియాణా ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్న విషయం తెలిసిందే. దానికి బాధ్యులు మీరంటే మీరంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ట్రాఫిక్ జామ్ ఫలితంగా గుర్‌గావ్ పోలీసు కమిషనర్ విర్క్ మీద బదిలీవేటు కూడా పడింది.