న్యూఢిల్లీ: తాను రాజీనామా చేయలేదని హరియాణా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బారాలా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినమేర ఫలితాలు రాబట్టడంలో విఫలమవడంతో నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో సుభాష్ బారాలాపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి.
మరోవైపు అమిత్ షా ఇప్పటికే.. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను ఢిల్లీకి రప్పించి, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చలు జరిపారు. 75 సీట్లు కచ్చితంగా గెలుస్తామనే నినాదంతో ముందుకెళ్లిన బీజేపీ, ఈసారి లెక్క తప్పింది. బీజేపీకి చెందిన ఏడుగురు మంత్రులు వెనుకంజలో ఉండడంతో.. ప్రస్తుతం మనోహర్ లాల్ ఖత్తర్ ప్రభుత్వం చిక్కుల్లో ఉంది. సుభాష్ పోటీ చేసిన ఫతేహబాద్ జిల్లాలోని తోహన స్థానంలోనూ వెనుకంజలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి ఎన్నికల ప్రచారం చేసినా బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించలేకపోయింది. అక్కడ దుష్యంత్ చౌతాలా నేతృత్వం వహిస్తున్న జన్‌నాయక్ జనతా పార్టీ ముందంజలో ఉంది.
హరియాణా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు గెలవాలి. తాజా ఫలితాల్లో బీజేపీ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ) 10 సీట్లలో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటులో జేజేపీ కీలకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment