అంబేడ్కర్ విజన్‌ను నిర్లక్ష్యం చేశారు
ఇందుకు కాంగ్రెస్ పశ్చాత్తాప పడక తప్పదు
♦ అంబేడ్కర్ 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ
♦ బాబా సాహెబ్ చూపిన దారిలో ఎన్‌డీఏ ప్రభుత్వం నడుస్తోంది
♦ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నందుకు గర్విస్తున్నా..
♦ గ్రామాల అభివృద్ధితోనే అంబేడ్కర్‌కు ఘనమైన నివాళి అని వ్యాఖ్య
♦ ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్’ కార్యక్రమం ప్రారంభం
మహు: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేడ్కర్ ఘన వారసత్వాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇందుకు ఆ పార్టీ పశ్చాత్తాపపడాలని వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ చూపిన దారిలో తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ‘బాబా సాహెబ్’ అడుగుజాడల్లో నడుస్తున్నందుకు తాను గర్విస్తున్నానని పేర్కొన్నారు. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని మహులో గ్రామ స్వయం పాలనా కార్యక్రమం ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.
అంబేడ్కర్ జన్మస్థలానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని మోదీ చెప్పారు. గ్రామాలను అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని... ఇదే మనం అంబేడ్కర్‌కు అర్పించే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి మరింత ఊతమిచ్చేందుకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అంబేడ్కర్ ఆదర్శాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. ఆయన ఆశయాలైన బలహీన వర్గాల సంక్షేమం, సముద్ర తీర ప్రాజెక్టులు వంటివాటిని చేపడుతున్నామని చెప్పారు.
ఇన్నేళ్లూ కాంగ్రెస్ ఏం చేసింది?
అంబేడ్కర్ విజన్ చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురవుతోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఇన్నేళ్లూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అంబేడ్కర్‌కు చెందిన ఐదు స్థలాల (పంచ తీర్థాలు)ను అభివృద్ధి చేయలేదేమని ప్రశ్నించారు. ‘‘బాబా సాహెబ్ చూపిన మార్గాన్ని అనుసరిస్తేనే సామాజిక సమతౌల్యం సాధ్యమవుతుంది. ఆయన అడుగుజాడల్లో నడవడాన్ని నేను గర్వంగా భావిస్తున్నా. అంబేడ్కర్ చివరిరోజుల్లో నివసించిన ఢిల్లీలోని అలీపూర్ రోడ్, 26 నంబర్ ఇంటిని ఆయన స్మారకంగా మారుస్తున్నాం. కానీ చాలా ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ పని ఎందుకు చేయలేకపోయింది. ఇన్నేళ్లూ నిర్లక్ష్యంగా వ్యవహరించి.. ఇప్పుడు మేం ఆ పని చేస్తుంటే తట్టుకోలేకపోతోంది. దీనిపై వారు పశ్చాత్తాపపడాల్సిందే. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేవారికి సమాజాన్ని విభజించడం తప్ప మరో ఆలోచన రాదు..’’ అని మోదీ మండిపడ్డారు. గత 60 ఏళ్లుగా పేదలకు ఏమీ చేయలేని కాంగ్రెస్.. రాత్రీపగలూ పేదల గురించే మాట్లాడడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. కానీ తమ ప్రభుత్వం పేదరికాన్ని పారదోలేందుకు చర్యలు చేపడుతోందన్నారు. పేదలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామని, వారికి బ్యాంకులతో అనుసంధానం కల్పించేందుకు జన్‌ధన్ యోజనను ప్రారంభించామని తెలిపారు.
గ్రామ పునాదులను బలోపేతం చేయాలి
సుస్థిర, సమగ్ర అభివృద్ధి కోసం గ్రామాలను బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తాము చేపట్టిన గ్రామీణ విద్యుదీకరణ, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, గృహాల నిర్మాణం వంటివన్నీ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగానే రూపొందినవని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లవుతున్నా.. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఇప్పటికీ రూపును సంతరించుకోలేదన్నారు. గ్రామాలను మార్చివేసేందుకే తాము ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్’ను చేపట్టామన్నారు.