
ఆ భూమిని నేనేమీ కబ్జా చేయలేదు: నటి
ముంబై: ముంబై నగరంలోని అత్యంత ఖరీదైన భూమిని కారుచౌక ధరకు తన నాట్య సంస్థకు కట్టబెట్టడంపై చెలరేగుతున్న రాజకీయ దుమారం మీద బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమామాలిని స్పందించారు. తానేమీ ఆ భూమిని కబ్జా చేయలేదని, దాని కొనుగోలు విషయంలో ప్రభుత్వ నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తానని వివరణ ఇచ్చారు.
అంధేరి పరిసర ప్రాంతాల్లోని అంబివాలిలో రెండు వేల చదరపు మీటర్ల స్థలాన్ని మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం హేమామాలినికి రూ. 70 వేలకే కట్టబెట్టింది. మాలిని నేతృత్వంలోని నాట్యవిహార్ కళాకేంద్ర చారిటీ ట్రస్ట్ ఈ ప్రదేశంలో ఓ నృత్య కేంద్రాన్ని నిర్మించనుంది. ఈ భూకేటాయింపుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం రాజకీయ వేడిని ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో హేమ స్పందిస్తూ.. ఈ భూమికి ఇప్పటివరకు తానేమీ చెల్లించలేదని, ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం ధరను చెల్లించి భూమిని కొనుగోలు చేస్తానని అన్నారు. ఈ వివాదంతో తన డ్యాన్స్ ఇన్ స్టిట్యూట్ కు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా పేరు వచ్చిందని, అయినా ఈ అంశాన్ని రాజకీయం చేయడం తగదని ఆమె పేర్కొన్నారు.