బెంగళూరు : నా సొంత ఖర్చులతో త్వరలోనే అమెరికా వెళ్తున్నా అంటున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ఇంత సడెన్‌గా కుమారస్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఓ కారణం ఉంది. ప్రస్తుతం కుమారస్వామి పల్లె నిద్ర పేరిట గ్రామాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం నేటితో ముగింపుకు చేరుకుంది. అయితే సీఎం పల్లె నిద్ర కార్యక్రమం కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారని.. పల్లెల్లో కూడా ఫైవ్‌స్టార్ హోటల్ అరెంజ్‌మెంట్స్ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కుమారస్వామి త్వరలోనే తాను అమెరికా వెళ్తున్నాని.. అందుకు అయ్యే ఖర్చును పూర్తిగా తానే భరిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. ‘ఆదిచుంచునగరి మఠం శంకుస్థాపన నిమిత్తం త్వరలోనే న్యూ జెర్సీ వెళ్తున్నాను. ఇది అధికారిక పర్యటన కాదు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అమెరికా వెళ్తున్నాన’ని తెలిపారు. ఇక తన పల్లె నిద్ర కార్యక్రమం గురించి విపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై కుమారస్వామి స్పందిస్తూ.. ‘ఈ మధ్యే ఒక పాఠశాలలో బస చేసినప్పుడు అక్కడ ఓ మంచి వాక్యం నా కంట పడింది. అర్థంలేని ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం అని పాఠశాల గోడల మీద రాసి ఉంది. అదే ఇక్కడ నేను పాటిస్తున్నాను’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment