ఎకరం భూమి కోసం.. ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు!
ఎకరం భూమి కోసం.. ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు!
Published Mon, Oct 31 2016 9:28 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM
జన్మభూమి మీద మమకారం చంపుకోవడం కష్టం. దాని విలువ ఎంత అన్నది పక్కన పెడితే.. సొంతూరిలో కొద్దిమాత్రం భూమి ఉన్నా సరే దాన్ని కాపాడుకోవాలని చూస్తుంటారు. సరిగ్గా ఇలాంటి అభిమానమే ఓ ఎన్నారైని ఆస్ట్రేలియా నుంచి రప్పించింది. ఆ దేశంలో ఐటీ మేనేజర్‌గా మంచి పొజిషన్‌లో ఉన్న రోహితస్వ దాస్ అనే వ్యక్తి.. సింగూరులోని తన ఎకరం భూమి కోసం అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాడు. తాను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు ఆ ఎకరం భూమే కారణమని అతడు గర్వంగా చెబుతున్నాడు. బెల్‌మాంట్ సివిక్ సెంటర్ ప్రాతంలో ఐటీ మేనేజర్‌గా పనిచేస్తున్న దాస్‌కు సింగూరు ప్రాంతంలో సరిగ్గా ఎకరం భూమి (మూడు భిగాలు) ఉంది. తన పూర్వీకుల పొలాన్ని చూసుకుని అతడు ఆనందబాష్పాలు కార్చాడు. ఈ భూమిలో తమ కుటుంబం ప్రత్యేక రకానికి చెందిన వంకాయలు పండించేదని గుర్తుచేసుకున్నాడు.
''నా చిన్నతనం అంతా ఇక్కడే గడిపాను. మాది రైతు కుటుంబం. ఈ భూమిలో మేం వంకాయలు, బంగాళాదుంపలు పండించి, వాటిని అమ్మి జీవించేవాళ్లం. వాటితో వచ్చిన డబ్బులతోనే నేను బారానగర్‌లోని ఇండియన్ స్టాటస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎం.స్టాట్ చేశాను. తర్వాత, బరోడాలో ఉద్యోగం చేసి అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లాను. అలా వెళ్లినంత మాత్రాన సింగూరుతో నా బంధం ఏమాత్రం తెగిపోలేపదు. ప్రతి రెండేళ్లకోసారి ఇక్కడికొచ్చి పొలం చూసుకుంటూ ఉంటాను. మా బంధువుల్లో కొందరు ఇప్పటికీ వ్యవసాయం చేస్తూనే ఉన్నారు'' అని దాస్ చెప్పారు.
సింగూరు భూముల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివరాలను దాస్ ఆస్ట్రేలియన్ పత్రికలలో చదివాడు. ఈ అంశానికి ఆస్ట్రేలియన్ మీడియాలో చాలా విస్తృతంగా కవరేజి వచ్చిందని, తర్వాత తన బంధువులు ఫోన్ చేసి.. భూమి తిరిగి తీసుకోడానికి సింగూరు రమ్మని పిలిచారని తెలిపారు. వ్యవసాయం అనేది తన రక్తంలోనే ఉందని.. దాంతో ఏమాత్రం ఆతృత ఆపుకోలేక వెంటనే పరుగున వచ్చేశానని అన్నారు. మొదట్లో తాను కూడా ఇక్కడ కార్ల పరిశ్రమ పెడితే అందరికీ ఉద్యోగాలు వస్తాయని అనుకున్నానని, కానీ తన ఇంటి ముందే పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ కాల్చేసరికి పేదలను వేధిస్తున్న తీరు చూసి పరిశ్రమ వద్దనుకున్నానని చెప్పారు. బలవంతంగా భూమి లాక్కోకుండా.. రైతులను సంప్రదించి ఉండాల్సిందని అన్నారు. ఆస్ట్రేలియా నుంచి దాస్‌తో పాటు అమెరికా నుంచి విద్యుత్ ఘోష్, దుర్గాశంకర్ బోస్ అనే ఇద్దరు కూడా సింగూరు ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న తమ భూమల కోసం వచ్చారు.
Advertisement
Advertisement