ఇతడు మెదడుతో చూస్తాడు..!
కంటి చూపు లేకపోయినప్పటికీ చుట్టూ ఉన్న పరిసరాలను, పరిస్థితులను అంధులు ఎంతో చక్కగా అంచనా వేయగలుగుతారు. ఈ కోవలోకే వస్తాడు 17 ఏళ్ల జీత్‌త్రివేది. అయితే ఇతడు అంధుడు కాదు. కానీ డ్రైవింగ్, చదవడం, సూదిలో దారం గుచ్చడం వంటి పనులను కళ్లు మూసుకుని చకచకా చేసేస్తాడు. గతేడాది సెప్టెంబర్‌లో 40 కిలోమీటర్ల వరకు కళ్లకు గంతలు కట్టుకుని బైక్ నడిపి చూపించాడు. ఎలా ఇలా అంటే.. మధ్య మెదడును యాక్టివేట్ చేయడం వల్ల ఏదయినా సాధ్యమే అంటున్నారు జీత్ ట్రైనర్ భరత్ పటేల్. జీత్‌కు తన ఇంద్రియాల పట్ల చక్కని నియంత్రణ ఉందని, ఒక అవయవాన్ని మనం పనిచేయకుండా ఆపేస్తే ఆ పనిని ఇంకో అవయవం సహాయంతో చేయగలుతాడని భరత్ చెప్పారు.
అంతేకాదు కళ్లకు గంతలు కట్టుకునే జీత్ పుస్తకాలు చదవగలడు, తన ఎదురుగా వచ్చే వస్తువులను పట్టుకోగలడు, దాగి ఉన్న వస్తువులను కనిపెట్టగలడు, ఒకేసారి ముగ్గురితో చెస్ ఆడగలడు. ఎదురుగా వచ్చే వస్తువు వాసన బట్టి గుర్తించగలుగుతున్నానని, ఆ వస్తువు ఏంటో కూడా చెప్పగలనని జీత్ చెబుతున్నాడు. మధ్య మెదడును ఉత్తేజితం చేస్తే ఆ విద్య ఎవరికైనా సాధ్యమేనంటున్నారు భరత్. సమాజంలో జీత్‌లా ఏ చిన్నారికైనా ఈ శిక్షణ ఇవ్వచ్చని, అయితే కావాల్సిందల్లా ఓపిక, పట్టుదల, తల్లిదండ్రుల్లో సానుకూల దృక్పథం అని వివరించారు.