
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 3374 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 472 కేసులు నమోదవగా 11 మంది మరణించారని పేర్కొన్నారు. 274 జిల్లాల్లో మహమ్మారి ప్రభావం నెలకొందని, వైరస్ నుంచి కోలుకుని ఇప్పటివరకూ 267 మంది డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు. తబ్లిగీ జమాత్ ద్వారా కేసులు విపరీతంగా పెరగడం వల్ల వైరస్ కేసులు రెట్టింపయ్యే వ్యవధి 4.1 రోజులుగా ఉందని, ఈ ఘటన చోటుచేసుకోని పక్షంలో కేసులు రెట్టింపయ్యే వ్యవధి 7.4 రోజులుగా ఉండేదని చెప్పారు.
మొత్తం కేసుల్లో 30 శాతం ఢిల్లీలో జరిగిన మర్కజ్‌లో పాల్గొన్న తబ్లిగీ సభ్యుల కారణంగా వ్యాపించినవేనని వెల్లడించారు. కరోనా వైరస్ రోగుల కోసం దేశవ్యాప్తంగా 27,661 షెల్టర్ క్యాంపులు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. ఇక కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఐక్యతా స్ఫూర్తిని చాటేలా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు అనుగుణంగా ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు దీపాలను వెలిగించేందుకు ప్రజలు సంసిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment