న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు మరీ దారుణంగా ఏమీ లేవని కేంద్ర వైద్యారోగ్య శాఖ వ్యాఖ్యానించింది. అధిక జనాభా ఉన్న దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర వైరస్ వ్యాప్తి తక్కువే ఉందని చెప్పింది. ప్రతి 10 లక్షల మందిలో 837 మందికే వైరస్ సోకిందని మంగళవారం నాటి మీడియా సమావేశంలో వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొన్ని దేశాల్లో ఈ సంఖ్య 12 నుంచి 13 రెట్లు అధికంగా ఉందని వెల్లడించారు. వైరస్ నియంత్రణ చర్యల్లో భారత్ పనితీరు మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. మరణాల రేటు కూడా భారత్‌లో తక్కువే ఉందని తెలిపారు.
మరణాల రేటు పది లక్షల మందిలో 20.8 గా ఉందని, ప్రపంచవాప్యంగా ఇది 77 గా ఉందని చెప్పారు. యూకేలో 667, యూఎస్‌లో 421, బ్రెజిల్‌లో 371, మెక్సికోలో 302 గా మరణాల రేటు ఉందని వెల్లడించారు. భారత్ కంటే యూఎస్‌లో మరణాల రేటు 21 రెట్లు అధికంగా, యూకేలో 33 రెట్లు అధికంగా ఉందని పేర్కొన్నారు. టెస్టుల్లో కూడా భారత్ మెరుగ్గా ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ విధించిన బెంచ్ మార్క్ కన్నా ఎక్కువే టెస్టులు చేస్తున్నామని అధికారులు చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పది లక్షల జనాభాకు కనీసం 140 టెస్టులు చేయాలని చెప్పగా.. భారత్‌లో మిలియన్‌కు 180 టెస్టులు చేస్తున్నామని పేర్కొన్నారు.
(చదవండి: కోవిడ్‌కు అత్యంత చవకైన ట్యాబ్లెట్ ఇదే!)
ఆ సంఖ్య చూసి గాబరా పడొద్దు
ప్రజలు దేశంలో నమోదైన మొత్తం పాటిజివ్ కేసుల సంఖ్య చూసి గాబరా పడకుండా యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య చూడాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచించారు. మన దగ్గర ప్రస్తుతం 4,02,529 యాక్టివ్ కేసులున్నాయని, ఈ సంఖ్య దేశ ఆరోగ్య రంగంపై వైరస్ లోడ్‌ను సూచిస్తుందని అన్నారు. మార్చిలో యాక్టివ్ కేసులు 90 శాతంగా ఉండగా ప్రస్తుతం 40 శాతంగా ఉందని తెలిపారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా చేస్తున్న వైరస్ నిర్ధారణ పరీక్షల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల రేటు 8.07 శాతంగా ఉందని, దాన్ని 5 కు తీసుకురావడమే కేంద్రం లక్ష్యమని అధికారులు తెలిపారు. వైరస్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల నమోదు రేటు 10 శాతం కన్నా ఎక్కువగా ఉందని చెప్పారు. తొలుత దానిని 10 శాతానికి అనంతరం ఐదు శాతానికి తీసుకొచ్చేందుకు కేంద్ర అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 11.55 లక్షలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment